తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాంతి సంబరాలు అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లో ఘనంగా నిర్వహించారు. నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం మాకవరపాలెం అవంతి కళాశాల ఆవరణలో మంగళవారం జరిగిన ఈ వేడుకల్లో అవంతి విద్యా సంస్థల చైర్మన్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అవంతిపురం పేరుతో ముందుగా ఒక ఆవరణను ఏర్పాటు చేశారు. అందులో రకరకాల రంగులతో వేసిన రంగవల్లులు వీక్షకులను ఆకట్టుకున్నాయి. కట్టెల పొయ్యి పై వంటలు, బిడ్డకు అక్షరాల దిద్దిస్తున్న తల్లి, పాత రోజులనాటి మట్టి ఇల్లు, ఇలా గత జ్ఞాపకాలను గుర్తుకు తెస్తూ అవంతిపురం ఆవరణను వైభవోపేతంగా తీర్చిదిద్దారు.భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతిబింబించేలా ముందుగా భోగి మంటలు వెలిగించారు. తర్వాత అందంగా అలంకరించిన గంగిరెద్దుల ఆటలు ఆకట్టుకున్నాయి. హరిదాసుల హరికథ ఆలాపన అలరించింది. జానపద కళాకారుల ప్రదర్శనలు, కత్తి కట్టకుండా సరదాగా కోడిపందాలు నిర్వహించారు. ఆకర్షణీయమైన ముగ్గుల మధ్య అందంగా అలంకరించిన గొబ్బెమ్మలు ఆకాశాన్ని తాకేలా ఎగరేసిన గాలి పటాలు ఆకర్షణీయంగా కని పించాయి. ఈ వేడుకల్లో కళాశాలకు చెందిన విద్యార్థులు తెలుగు సంస్కృతిని చాటి చెప్పేలా సాంప్రదాయ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. కళాశాలలో చదువుతున్న 3 వేల మందికి పైగా విద్యార్థులు ఈ వేడుకలకు హాజరయ్యారు.
0 Comments