ఆ తండ్రి ప్రేమ ముందు కుంగిపోయిన జోరు వాన...
ప్రాణాలు కాపాడాలని 4 కి.మీ. భుజాన మోస్తూ ఆస్పత్రికి...
బాలికకు మెరుగైన వైద్య సేవలు అందించాలని గిరిజన సంఘం డిమాండ్
అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 14(సురేష్ కుమార్, అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్): మట్టి గోడ కూలి తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న తన ఎనిమిదేళ్ల కుమార్తెను కాపాడుకోవడానికి ఓ తండ్రి చేసిన పోరాటం అందరినీ కదిలించింది. రహదారి సౌకర్యం లేక అంబులెన్స్ కూడా రాని గ్రామంలో, జోరు వానను సైతం లెక్కచేయకుండా తన బిడ్డను భుజాలపై మోస్తూ దాదాపు 4 కిలోమీటర్లు నడిచి ఆస్పత్రికి చేర్చిన ఆ తండ్రి పడిన వేదన వర్ణనాతీతం.
చింతపల్లి మండలం తాటిబంద గ్రామానికి చెందిన సీదెరి సత్తిబాబు కుమార్తె లక్ష్మి (8) తన స్నేహితులతో ఆడుకుంటుండగా, అనుకోకుండా పాడుబడిన ఇంటి మట్టి గోడ ఆమెపై కూలింది. మిగతా పిల్లలు సురక్షితంగా తప్పించుకోగా, లక్ష్మి తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయింది. బిడ్డ పరిస్థితి చూసి ఆ తండ్రి గుండె పగిలింది. ఎలాగైనా తన కుమార్తెను బతికించుకోవాలనే తపనతో, గ్రామస్థుల సాయంతో ఆమెను బయటకు తీశాడు. అంబులెన్స్ రాదన్న నిరాశలో, కురుస్తున్న భారీ వర్షాన్ని పట్టించుకోకుండా లక్ష్మిని తన భుజాలపై వేసుకుని నడక ప్రారంభించాడు. దట్టమైన అటవీ ప్రాంతంలో, బురదమయమైన దారిలో 4 కిలోమీటర్లు నడిచి కొయ్యూరు మండలం డౌనూరు పంచాయతీలోని బచ్చింత గ్రామానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి ఆటోలో డౌనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత, మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం లక్ష్మి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన బిడ్డ త్వరగా కోలుకోవాలని ఆ తండ్రి కుటుంబ సభ్యులతో కలిసి కన్నీటి పర్యంతమవుతున్నాడు.
రహదారి సౌకర్యం లేక తాటిబంద గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులకు ఈ హృదయ విదారక ఘటన మరో ఉదాహరణగా నిలిచింది. మన్యంలో రహదారి సౌకర్యాలు లేక అనేక గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులకు ఇది ప్రత్యక్ష సాక్ష్యంలా నిలిచింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ ఘటనపై గిరిజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి సాగిన చిరంజీవి మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రోడ్డు సౌకర్యాలు లేవని, సకాలంలో వైద్యం అందకపోవడం వల్ల బాలిక ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాలికకు మెరుగైన వైద్యం అందించాలని, మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
0 Comments