అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు - స్థిరమైన ధర - ట్రేడర్స్‌ అసోసియేషన్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్‌ చర్యలు

అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు 
స్థిరమైన ధర - ట్రేడర్స్‌ అసోసియేషన్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్‌ చర్యలు

​పాడేరు డిసెంబర్ 08 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): ​అరకు కాఫీకి అంతర్జాతీయ మార్కెట్‌లో స్థిరమైన ధర, అత్యుత్తమ గుర్తింపు లభించేలా జిల్లా యంత్రాంగం పటిష్టమైన ప్రణాళికలు రూపొందిస్తోందని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. కాఫీ రైతులు, వ్యాపారులు, ఎఫ్‌పీఓలు,  ఎన్జీఓలతో  సోమవారం నిర్వహించిన అవగాహన, చర్చా కార్యక్రమంలో  కీలక ఆదేశాలు జారీ చేశారు.
​జిల్లాలో కాఫీ ట్రేడర్స్‌ అందరూ కలిసి ట్రేడర్స్‌ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటే, దానికి చట్టబద్ధత కల్పించి, దాని ద్వారానే వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని కలెక్టర్ ప్రకటించారు. ఈ అసోసియేషన్ ద్వారా నాణ్యమైన పంటకు స్థిరమైన ధర లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు తమ కాఫీ పంటను మధ్య దళారుల ప్రమేయం లేకుండా నేరుగా అమ్ముకోవడానికి జిల్లాలో కాఫీ రైతు బజార్లను ఏర్పాటు చేయనున్నారు. కాఫీ రైతులు ముందుకు వస్తే, యూనిట్ వ్యయంలో 30% రాయితీతో యంత్ర పరికరాలను అందజేయడం జరుగుతుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. 
​వ్యాపారం చేసే ప్రతి ఒక్క ట్రేడర్ తప్పనిసరిగా కాఫీ ట్రేడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని ఆదేశించారు. లేనిపక్షంలో చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అరకు కాఫీ నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన పార్చిమెంట్ అందించాలని, పండ్ల సేకరణ నుండి తయారీ వరకు అత్యున్నత ప్రమాణాలు పాటించాలని కోరారు.  అరకు, డుంబ్రిగూడ మండలాల్లో బెర్రీ బోరర్ తెగులు ఆశించినందున, పంట సేకరణ, పల్పింగ్ మరియు డ్రైయింగ్‌లలో తగు జాగ్రత్తలు పాటించాలి. తెగులు నివారణకు సంబంధించిన వీడియోలను కాఫీ బోర్డు తరచుగా పోస్ట్ చేయాలని ఆదేశించారు. పంట అక్రమ రవాణాపై నిరంతర నిఘా కోసం చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, అగ్రికల్చర్ సిబ్బంది, ఐటీడీఏ, రెవెన్యూ సిబ్బందితో నిరంతరం పర్యవేక్షణ చేపట్టనున్నారు. కాఫీ పంట రవాణాకు ప్రభుత్వ అనుమతి పొందిన పత్రాలు తప్పనిసరి. అనుమతులు లేని పక్షంలో సరుకును సీజ్ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సంతలు, కొనుగోలు కేంద్రాల్లో తూకాలలో మోసం జరగకుండా, జీసీసీ, ఐటీడీఏ  సహకారంతో డిజిటల్ తూనిక యంత్రాలను ఏర్పాటు చేయాలని పాడేరు ఐటీడీఏ పీవోను ఆదేశించారు. వచ్చే సంవత్సరం జీ. మాడుగుల, జీ.కే వీధి మండలాల్లో రెండు ఏకో పల్పింగ్ యూనిట్లు నిర్మాణం పూర్తి చేయాలని ప్రాజెక్ట్ అధికారిని ఆదేశించారు. చింతపల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీని ద్వారా ఎఫ్‌పీఓలు, ఆసక్తిగల ఎంటర్‌ప్రైజెస్ లబ్ధి పొందుతారని కలెక్టర్ తెలియజేశారు. ​ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో తిరుమాన శ్రీపూజ మాట్లాడుతూ జీసీసీ ద్వారా కాఫీ పండ్ల సేకరణ జరుగుతుందని, రైతులు కొనుగోలు కేంద్రాలను సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులు, కాఫీ బోర్డు శాస్త్రవేత్తలు, రైతులు మరియు వ్యాపారులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments