నాల్కో ప్రకటనపై వైకాపా నేత మోరి రవి ఆగ్రహం
అల్లూరి జిల్లా, చింతపల్లి, డిసెంబర్ 8 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): అల్లూరి మన్యం ప్రాంతంలో ఉన్న బాక్సైట్ నిల్వల జోలికి వస్తే ఏమాత్రం సహించేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా) సీనియర్ నాయకులు మోరి రవి నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో)ని హెచ్చరించారు. సోమవారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి నాల్కో ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్ చేసిన ప్రకటనపై మోరి రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే జూన్ నెల కల్లా బాక్సైట్ తవ్వకాలను ప్రారంభిస్తామని నాల్కో ఛైర్మన్ చేసిన ప్రకటన మన్యం ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఆయన మండిపడ్డారు. దశాబ్దాలుగా గిరిజనులు తమ అడవులను, కొండలను కాపాడుకోవడానికి పోరాడుతున్న విషయాన్ని నాల్కో యాజమాన్యం విస్మరించకూడదన్నారు. మన్యం ప్రాంతంలోని బాక్సైట్ నిల్వలు ఏ ఒక్క కంపెనీ సొత్తు కాదనీ, అది గిరిజనుల ఆస్తి, వారి సంస్కృతి, జీవనానికి ఆధారమన్నారు. పర్యావరణం నాశనమైతే ఇక్కడి ప్రజలు ఎక్కడికి పోవాలని ఆయన ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాల పెసా చట్టం, అటవీ హక్కుల చట్టాలను బేఖాతరు చేస్తూ, స్థానిక ప్రజల అనుమతి లేకుండా తవ్వకాలు మొదలుపెడతామని ప్రకటించడం దుర్మార్గమని మోరి రవి వ్యాఖ్యానించారు. మన్యం ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మోరి రవి గుర్తు చేశారు. బాక్సైట్ తవ్వకాలు ఇక్కడి అటవీ సంపదను, పర్యావరణాన్ని నాశనం చేస్తాయనీ, ముఖ్యంగా, గిరిజనుల జీవనాధారం, హక్కులకు భంగం కలిగిస్తాయని, ఈ ప్రాంత ప్రజల అనుమతి లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి వీలు లేదని ఆయన స్పష్టం చేశారు. బాక్సైట్ తవ్వకాలను అడ్డుకునేందుకు మన్యం ప్రాంత ఆదివాసీ ప్రజలు, గిరిజన పోరాట సంఘాలు, అదేవిధంగా రాజకీయాలకతీతంగా ప్రజాప్రతినిధులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టక తప్పదని ఆయన హెచ్చరించారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశంలో జోక్యం చేసుకుని, నాల్కో కంపెనీని నియంత్రించాలని మోరి రవి డిమాండ్ చేశారు. తద్వారా, అల్లూరి మన్యంలో గిరిజనుల హక్కులు, పర్యావరణం పరిరక్షించబడతాయని ఆయన ఆకాంక్షించారు.
0 Comments