అల్లూరి జిల్లా, చింతపల్లి, డిసెంబర్ 2 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్):
నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'కౌశలం' (వర్క్ ఫ్రమ్ హోమ్) కంప్యూటర్ ఆధారిత పరీక్షలు తొలి రోజే సాంకేతిక వైఫల్యంతో అపహాస్యం పాలయ్యాయి. చింతపల్లి మండలంలో దరఖాస్తు చేసుకున్న 220 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరులేకపోవడం వ్యవస్థాగత లోపానికి నిదర్శనంగా నిలిచింది.డిసెంబర్ 2 నుండి 6 వరకు గ్రామ-వార్డు సచివాలయాల వేదికగా జరగాల్సిన ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు అభ్యర్థులకు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు సమయంతో ఓటీపీలు రావాల్సి ఉంది. అయితే, పరీక్షా వ్యవస్థలోని సాంకేతిక లోపం కారణంగా ఆ ఓటీపీలు జనరేట్ కాలేదు. దీంతో, అభ్యర్థులు పరీక్ష సమయం వచ్చినా కేంద్రాలకు హాజరు కాలేకపోయారు. ఈ విషయమై స్థానిక ఎంపీడీఓ సీతా మహాలక్ష్మిని వివరణ కోరగా, తొలి రోజు పరీక్షలకు ఓటీపీలు అందకపోవడం వల్లే మండలంలో ఒక్కరు కూడా రాలేకపోయారన్నారు. ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించి, మిగిలిన రోజుల్లో పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు. కేవలం ఐదు రోజుల పాటు జరిగే కీలకమైన పరీక్షకు ముందు కనీస సాంకేతిక ఏర్పాట్లు చేయకపోవడంపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోరుకున్న ఉపాధి కోసం ఆశగా ఎదురుచూస్తుంటే, ప్రభుత్వం తరపున జరుగుతున్న మొట్టమొదటి రోజు పరీక్షే ఇలా రద్దైందనీ, ఈ కీలకమైన 'కౌశలం' కార్యక్రమం గురించి కిందిస్థాయి అధికారులకే సరైన అవగాహన లేకపోతే, సామాన్య ప్రజలకు భరోసా ఎవరు ఇస్తారని, మొదటి రోజు పరీక్ష కోల్పోయిన 220 మందికి తిరిగి అవకాశం కల్పిస్తారా?" అని దరఖాస్తుదారులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రారంభంలోనే ఎదురైన ఈ వైఫల్యంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో, పరీక్ష కోల్పోయిన అభ్యర్థులకు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారో వేచి చూడాలి.
0 Comments