పల్లె వెలుగు సర్వీసులను పునరుద్ధరించాలి--గిరి ప్రజల ప్రయాణ కష్టాలు

పల్లె వెలుగు సర్వీసులను పునరుద్ధరించాలి
రెగ్యులర్ సర్వీసుల రద్దుతో మన్యం ప్రజలకు రవాణా కష్టాలు

అల్లూరి జిల్లా, చింతపల్లి అక్టోబరు 6 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్):
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం, ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన మహిళలకు అందని ద్రాక్షలా మారింది. ముఖ్యంగా ఏజెన్సీ ముఖద్వారంగా పేరుగాంచిన చింతపల్లి మండలంలో, నర్శీపట్నం ఆర్టీసీ డిపో ఉన్నతాధికారులు సాధారణ పల్లె వెలుగు సర్వీసులను తొలగించడంతో, మారుమూల గ్రామాల్లోని గిరి మహిళలు, ప్రజలు తీవ్ర రవాణా కష్టాలు ఎదుర్కొంటున్నారు.

రద్దయిన రెగ్యులర్ సర్వీసులు - పెరిగిన ప్రయాణ భారం

గతంలో మారుమూల గ్రామాలకు కీలకంగా ఉన్న రెగ్యులర్ పల్లె వెలుగు సర్వీసులు రద్దు కావడంతో, మండల కేంద్రానికి, మైదాన ప్రాంతాలకు చేరుకోవడం స్థానిక ప్రజలకు పెను సమస్యగా మారింది. ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రవేశపెట్టిన తర్వాత, సాధారణ సర్వీసులను తొలగించడం ద్వారా, ఈ పథకం గిరి మహిళలకు ఉపయోగపడకపోగా, మరింత భారం, కష్టాలను మిగిల్చిందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు
సర్వీసుల రద్దు కారణంగా, గిరిజనులు గంటల తరబడి బస్ స్టేషన్లలో వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. మైదాన ప్రాంతానికి వెళ్లినవారు తిరిగి తమ గూటికి చేరుకోవడానికి నర్సీపట్నం బస్ కాంప్లెక్స్‌లో గంటలు గడపాల్సి వస్తోంది. గతంలో నర్సీపట్నం డిపో నుంచి చింతపల్లికి ప్రతి 20 నిమిషాలకు ఒక 'టూ స్టాప్' సర్వీసు నడిచేది. ఇప్పుడవి కూడా పరిమితం కావడంతో, నర్సీపట్నం, పాడేరు డిపోల నుంచి కేవలం కొన్ని బస్సులు మాత్రమే ఏజెన్సీ వ్యాప్తంగా తిరుగుతున్నాయి.

మారుమూల గ్రామాల కష్టాలు- 'టూ స్టాప్'తో నిలిచిన బస్సులు
చింతపల్లి, జీకే వీధి మండలాలలోని మారుమూల ప్రాంతాలైన తాజంగి, కొండవంచుల, కొమ్మంగి, దామనాపల్లి, సిరిబాల, తూరుమామిడి వంటి గ్రామాలకు రోజూ రెండు సార్లు తిరిగే పల్లె వెలుగు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం నడుస్తున్న 'టూ స్టాప్' బస్సులు లంబసింగి, లోతుగడ్డ జంక్షన్ వంటి ప్రధాన ప్రాంతాల్లో మాత్రమే ఆగుతున్నాయి. దీంతో, మధ్యలో ఉన్న చిన్న గ్రామాలైన ఏటి గైరంపేట, మర్రిపాలెం, డౌనూరు, తురబాడ గెడ్డ, రావిమానుపాకలు, చిట్రాలగొప్పు, రాజుపాకలు, మడిగుంట, కృష్ణాపురం, పెద్దగెడ్డ, రౌరింతాడ, కొలపరి వంటి స్టాపుల పరిసర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ బస్సులు ఆగకపోవడంతో, ఆయా గ్రామాల ప్రజలు కిలోమీటర్ల దూరం నడిచి ప్రధాన బస్సు స్టాండ్‌కి చేరుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

రైతులు, ఉద్యోగులకు ఆర్థిక భారం

పల్లె వెలుగు బస్సుల రద్దుతో మారుమూల గ్రామాల ప్రజలతో పాటు, ఆయా ప్రాంతాలలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రైతులు వారి పంటలను తరలించుకునే సౌలభ్యాన్ని కోల్పోయారు.

సంత స్పెషల్స్ రద్దు

గతంలో నర్సీపట్నం, పాడేరు డిపోల నుంచి సంత జరిగే ప్రదేశాలకు 'సంత స్పెషల్' బస్సులు నడిచేవి. వీటి ద్వారా మారుమూల గ్రామాల ప్రజలు నిత్యావసరాల కొనుగోళ్లకు, గిరి రైతులు పండించిన పంటల విక్రయం సులభంగా చేసుకునేవారు. ప్రస్తుతం ఆ సర్వీసుల రద్దుతో రైతులు, ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించక తప్పడం లేదు. దీన్ని అదునుగా తీసుకొని ప్రైవేట్ వాహనదారులు అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులు కొల్లగొడుతున్నారు.

పాడేరు డిపోలోనూ అదే సమస్య

పాడేరు డిపో నుంచి అన్ని ప్రాంతాలకు బస్సులు ఉన్నా, మొదటి రెండు స్టాపుల్లోనే బస్సులు ఫుల్ అయిపోతున్నాయి. దీనివల్ల మధ్యలో ఉన్న స్టాపుల వద్ద ప్రయాణికులు ఉన్నా బస్సు ఎక్కలేని పరిస్థితి నెలకొంది. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు మంజూరు చేయాలని మొరపెట్టుకుంటున్నా, అధికారులు, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.

ఓ మారుమూల గ్రామానికి చెందిన రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ, "ఒకప్పుడు మా ఊరికి పల్లెవెలుగు బస్సు ఉండేది. పండిన పంటలు మార్కెట్‌కు వెళ్లేది ఆ బస్సులోనే. ఇప్పుడు ఆ సర్వీసులు లేవు. మా పిల్లలు కళాశాలకు వెళ్లాలన్నా, కొన్ని చోట్ల ఆటోలు కూడా రాక నడిచిపోవడం తప్ప మరో మార్గం లేదు," అని తెలిపారు. 
రద్దు చేసిన పల్లె వెలుగు సర్వీసులను వెంటనే పునరుద్ధరించి, ఏజెన్సీ ప్రజల, గిరిజన రైతుల, ఉద్యోగుల రవాణా కష్టాలను తీర్చాలని మన్యం వాసులు అధికారులను, ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Post a Comment

0 Comments