పంచాయతీ అభివృద్ధికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం ​- చింతపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ పుష్పలత

పంచాయతీ అభివృద్ధికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం 
గ్రామ సభలో కీలక చర్చలు, జాతీయ రహదారిపై పశువుల నియంత్రణకు తీర్మానం

చింతపల్లి సర్పంచ్ పుష్పలత

​అల్లూరి జిల్లా, చింతపల్లి, అక్టోబర్ 3 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : చింతపల్లి మేజర్ పంచాయతీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రజల భాగస్వామ్యంతోనే ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులు వేగంగా సాగుతాయని సర్పంచ్ దురియా పుష్పాలత పిలుపునిచ్చారు. చింతపల్లి మేజర్ పంచాయితీ పరిధిలోని ప్రజల సమస్యలు, అభివృద్ధి పనులపై శుక్రవారం చింతపల్లి సచివాలయం-1లో నిర్వహించిన గ్రామ సభ విజయవంతంగా జరిగింది. సర్పంచ్ పుష్పలతతో పాటు, పంచాయతీ ఇన్‌ఛార్జ్ సెక్రెటరీ అంబేద్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మొదటగా చింతపల్లి 1, 2, 3 సచివాలయాల ఉద్యోగస్తులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం, ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాల ప్రజలు, కూటమి నాయకులు కలిసి సుమారు మూడు గంటల పాటు పంచాయతీ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, పెండింగ్‌లో ఉన్న సమస్యలపై లోతుగా చర్చించారు. గ్రామంలోని సమస్యలు, సామాజిక పెన్షన్లు, ఆది కర్మయోగి పథకం కింద ఉన్న గ్రామాలు, బంగారు కుటుంబాలు, పంచాయతీ నిధుల వినియోగం వంటి అంశాలు ప్రధాన చర్చనీయాంశాలుగా నిలిచాయి. ​గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని, అలాగే, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద త్వరలో చేపట్టబోయే పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని గ్రామ సభలో నిర్ణయించారు. అత్యంత ముఖ్యమైన తీర్మానాల్లో ఒకటిగా, జాతీయ రహదారిపై పశువులను విచ్చలవిడిగా వదిలేసే యజమానులపై కఠిన చర్యలు తీసుకునేందుకు తీర్మానించారు. అంతేకాక, సీజన్‌లో వచ్చే అంటువ్యాధులు (సీజనల్ వ్యాధులు), వాటి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై కూడా చర్చించి, కీలక తీర్మానాలు చేశారు. ఈ గ్రామ సభ ద్వారా ప్రజల సమస్యలు మరియు పంచాయతీ అభివృద్ధి దిశగా కచ్చితమైన అడుగులు పడతాయని సర్పంచ్ పుష్పలత ఆశాభావం వ్యక్తం చేశారు. ​ఈ కార్యక్రమంలో చింతపల్లి 1, 2 ఎంపీటీసీలు దారలక్ష్మి, జయ లక్ష్మీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సేవ ఈశ్వరమ్మ, పెదిరెడ్ల బేతాళుడు, కిముడు కృష్ణమూర్తితో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనంద్, బీసీ సెల్ ఉపాధ్యక్షుడు లక్కోజు నాగభూషణం, జనసేన మండల అధ్యక్షుడు వంతల బుజ్జిబాబు, బీజేపీ నుండి కదుల్ల శ్రీను, గొర్లె సోమేశ్, జనసేన నాయకుడు మధు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments