నిధుల కొరతతో గిరిజనులకు దూరమవుతున్న ఐటీడీఏలు __వైకాపా గిరిజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్

నిధుల కొరతతో గిరిజనులకు దూరమవుతున్న ఐటీడీఏలు
వైకాపా గిరిజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్ 

అల్లూరి జిల్లా, చింతపల్లి సెప్టెంబర్ 1(సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్)  : ఒకప్పుడు గిరిజనులకు ఆశాదీపంగా ఉన్న సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ), ప్రస్తుతం నిధుల కొరతతో పట్టు కోల్పోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, గతంలో ఐటీడీఏ ద్వారా అనేక ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించేవని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. ఐటీడీఏ ప్రధాన లక్ష్యం గిరిజనుల అభ్యున్నతి కోసం పనిచేయడమేనని గుర్తు చేశారు. ఒకప్పుడు ఐటీడీఏ ప్రాజెక్టుల ద్వారా గిరిజనులకు వంద శాతం ఉద్యోగాలు లభించేవని, ఉదాహరణకు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) లో సేల్స్‌మెన్, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చేవారని ఆయన గుర్తు చేశారు. అయితే, జీవో నెంబర్ 3ని కోల్పోవడంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులకు ఆరు శాతం మాత్రమే రిజర్వేషన్ కల్పించడం వల్ల వారికి అన్యాయం జరుగుతుందని అన్నారు. గిరిజనులకు ఐటీడీఏ ఒక హక్కుగా ఉన్నప్పటికీ, ఐటీడీఏ ద్వారా వంద శాతం ఉపాధ్యాయ ఉద్యోగాలను ఎందుకు కల్పించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఐటీడీఏకు రిజర్వేషన్లు వర్తించవని అభిప్రాయపడుతూ, ఈ విషయంపై గిరిజన మేధావులు, సంఘాలు కూడా ఆలోచించాలని ఆయన కోరారు. గిరిజనులు ఇంకా సంపూర్ణంగా అభివృద్ధి చెందలేదని, అందువల్ల ఐటీడీఏలు మరింత చురుకుగా పనిచేయాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వాలు నిధులు మంజూరు చేసి ఐటీడీఏలను బలోపేతం చేయాలన్నారు. ఐటీడీఏల పనితీరును మెరుగుపరచి, గిరిజనుల పూర్తి అభివృద్ధికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సుధాకర్ విజ్ఞప్తి చేశారు.

Post a Comment

0 Comments