బరిస్టా కాఫీ తయారీపై గిరిజన యువతకు శిక్షణ__పోస్టర్ విడుదల చేసిన జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్

బరిస్టా కాఫీ తయారీపై గిరిజన యువతకు శిక్షణ
పోస్టర్ విడుదల చేసిన జిల్లా కలెక్టర్

జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్

పాడేరు, సెప్టెంబరు 3(సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : అరకు ప్రాంతంలోని గిరిజన యువతకు బరిస్టా కాఫీ తయారీపై శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 23 నుంచి 27 వరకు అరకు వైటీసీలో ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు కాఫీ బోర్డు ఆఫ్ ఇండియాతో సంప్రదింపులు జరిపి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహించేందుకు సంబంధిత పాస్టర్ ను జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్,  జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తో కలసి ఆవిష్కరించారు.

గౌరవ ముఖ్యమంత్రి వంజంగి గ్రామ పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) వ్యవస్థాపక మార్గాలు, నిరుద్యోగ యువతకు స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించడానికి కాఫీపై నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి సూచనల మేరకు APSSDC, కాఫీ బోర్డు సహకారంతో 5 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఈ శిక్షణతో గిరిజన యువతను పరిశ్రమ సంబంధిత నైపుణ్యాలతో శక్తి వంతం చేయొచ్చన్నారు. కాఫీ రంగంలో భవిష్యత్తును నిర్మించుకునే అవకాశం లభిస్తుందన్నారు. 
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి పి.రోహిణి, ట్రైబల్ వెల్ఫేర్ ఉపసంచాలకులు పి.బి.కె. ప్రమీల ఉన్నారు.

Post a Comment

0 Comments