చింతపల్లిలోనే కాపీ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలి
ఎంపీపీ అనూష దేవి, జడ్పీటీసీ పోతురాజు బాలయ్య
అల్లూరి జిల్లా, చింతపల్లి సెప్టెంబర్ 1 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): చింతపల్లిలోనే కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ యూనిట్‌ను మాకవరపాలెం మండలం శెట్టిపాలెం గ్రామానికి తరలించడాన్ని నిరసిస్తూ చింతపల్లి జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య, ఎంపీపీ కోరాబు అనూష దేవి, మండల పార్టీ అధ్యక్షులు పాంగి గణబాబులు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. సోమవారం ఓ ప్రకటనలో వారు మాట్లాడుతూ అధికారులు మాకవరపాలెం మండలం శెట్టిపాలెంలో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సుమారు 12 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి, దానికి సంబంధించిన దస్త్రాలను ప్రభుత్వానికి అందజేశారని సమాచారం ఉందన్నారు. దీనిపై శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు కూడా తెరవెనుక మంతనాలు జరుపుతున్నారని వారు ఆరోపించారు. కాఫీ, మిరియాలు విస్తారంగా పండే గిరిజన ప్రాంతాలైన చింతపల్లి, గూడెం కొత్తవీధి, కొయ్యూరు, జి. మాడుగుల వంటి ప్రాంతాల్లో కాకుండా మైదాన ప్రాంతమైన శెట్టిపాలెంలో యూనిట్‌ను ఏర్పాటు చేయడం గిరిజనుల ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో అధికారులు చూపిస్తున్న కారణాలు సరికాదని వారు అన్నారు. గిరిజన ప్రాంతం శీతలమని, ప్రభుత్వ భూమి లేదని, నేషనల్ హైవే పక్కన ఉండాలని చెప్పడం అవాస్తవమని, వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి, నేషనల్ హైవేకు దగ్గరగా ఉన్న చింతపల్లిలో యూనిట్ పెట్టడానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజనులకు వరాలు కురిపిస్తారని ఆశించగా, అందుకు విరుద్ధంగా గిరిజన ప్రాంతంలో రావాల్సిన యూనిట్‌ను మైదాన ప్రాంతానికి తరలించడం ఆయన కుటిల రాజకీయాలకు నిదర్శనమని వారు ఆరోపించారు. జీవో నెం. 3పై కూడా ఎలాంటి హామీ ఇవ్వకుండా, మెగా డీఎస్సీలో గిరిజన నిరుద్యోగులను మోసం చేశారని ధ్వజమెత్తారు.
గిరిజనులకు అండగా ఉండాల్సిన జీసీసీ ఎండీ, అల్లూరి, అనకాపల్లి జిల్లా కలెక్టర్లు కాఫీ యూనిట్‌ను మైదాన ప్రాంతానికి తరలించడానికి కృషి చేయడం దారుణమని వారు విమర్శించారు. జీసీసీ ఛైర్మన్ వెంటనే స్పందించి ఈ ప్రయత్నాలను అడ్డుకోవాలని, లేదంటే ఆయన గిరిజన ద్రోహిగా మిగిలిపోతారని హెచ్చరించారు. ఈ సమస్యపై రాజకీయాలకు అతీతంగా, అన్ని పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు ఒకే వేదికపైకి వచ్చి పోరాడాలని వారు పిలుపునిచ్చారు. అన్ని వనరులు గిరిజన ప్రాంతంలో ఉండి, ఉపాధి అవకాశాలు మాత్రం మైదాన వాసులకు దక్కడం అన్యాయమని, యావత్తు గిరిజన సమాజం దీనిపై స్పందించాలని వారు తమ ప్రకటనలో కోరారు.
0 Comments