పరిశుభ్రతతో ఆరోగ్యం.. పచ్చదనంతో పర్యావరణాన్ని కాపాడుకుందాం
హరితాంధ్ర లక్ష్యంగా అటవీ శాఖ స్వర్ణాంధ్ర-స్వచ్ఛ దివాస్
అటవీ రేంజ్ అధికారి వెంకటరావు, సెక్షన్ ఆఫీసర్ సింహాచలం
అల్లూరి జిల్లా, చింతపల్లి సెప్టెంబర్ 20 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యాన్ని, మొక్కలు నాటుతూ పచ్చదనం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకుందామని చింతపల్లి అటవీ రేంజ్ అధికారి ఎస్. వెంకటరావు, సెక్షన్ ఆఫీసర్ ఎం. సింహాచలం పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుమేరకు ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’లో భాగంగా ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే 'స్వచ్ఛ దివాస్' కార్యక్రమాన్ని చింతపల్లి డివిజనల్ అటవీ శాఖ అధికారి వై.వి. నర్సింగరావు ఆదేశాల మేరకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం చింతపల్లి డివిజన్ కార్యాలయం, ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బోడకొండమ్మ ఆలయం వద్ద జరిగింది. ఈ సందర్భంగా అటవీ అధికారులు, సిబ్బంది పరిశుభ్రత పనులతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. డివిజన్ కార్యాలయం పరిసరాల్లో రేంజ్ అధికారి వెంకటరావు ఆధ్వర్యంలో చెత్తాచెదారాలను తొలగించారు. అదే విధంగా, బోడకొండమ్మ ఆలయం, వ్యూ పాయింట్ వద్ద సెక్షన్ ఆఫీసర్ సింహాచలం పర్యవేక్షణలో పరిసరాలను శుభ్రం చేసి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని ఉద్ఘాటించారు. గృహ వ్యర్థాలు, ఇతర వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా, పంచాయతీలు సూచించిన ప్రదేశాలు లేదా చెత్తకుండీలలో వేయాలని సూచించారు. అలాగే తడి, పొడి చెత్తలను వేర్వేరుగా వాటి కోసం కేటాయించిన డబ్బాల్లోనే వేయాలని చెప్పారు. వాతావరణ సమతుల్యతను కాపాడటానికి మొక్కల పెంపకాన్ని ఒక యజ్ఞంలా ప్రతి ఒక్కరూ చేపట్టాలని, విరివిగా మొక్కలు నాటాలని వారు పిలుపునిచ్చారు. దీంతో పాటు అడవుల రక్షణ కూడా ముఖ్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీట్ ఆఫీసర్లు వరహాలు బాబు, వినోద్ కుమార్, ఇతర అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
0 Comments