విజ్ఞానంతో ఉన్నత శిఖరాల వైపు నడిపించడమే గురువుల లక్ష్యం
పిఆర్‌టియు అల్లూరి జిల్లా అధ్యక్షుడు వెంకటగిరి
అల్లూరి జిల్లా, చింతపల్లి సెప్టెంబర్ 05 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తూ ఉన్నత శిఖరాల వైపు నడిపించడమే గురువుల లక్ష్యమని, సమాజంలో మంచి పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల అసలు బాధ్యతని పిఆర్‌టియు అల్లూరి జిల్లా అధ్యక్షుడు ఉగ్రంగి వెంకటగిరి అన్నారు. భారతదేశ ద్వితీయ రాష్ట్రపతి, గొప్ప తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 137వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని, శుక్రవారం చింతపల్లి మండల కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖలో సుదీర్ఘకాలం పాటు అహర్నిశలు శ్రమించి, అనేక తరాలను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దిన సీనియర్ ఉపాధ్యాయుడు సాగిన వీరన్న పడాల్ ని సన్మానించారు. పిఆర్‌టియు సభ్యులు ఆయనకు సాలువ కప్పి, చిరుకానుక జ్ఞాపిక బహుమతి అందజేసి ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయ వృత్తిలో ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ పలువురు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు నేటి తరం విద్యార్థులకు విలువల ఆధారిత విద్య అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదనంగా మండలంలోని పలువురు ఉపాధ్యాయ మిత్రులు, విద్యావేత్తలు, స్థానిక ప్రజలు కూడా ఈ సన్మాన కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పిఆర్‌టియు రాష్ట్ర కౌన్సిలర్ కొర్రు మత్యలింగం, జిల్లా మహిళా కార్యదర్శి రోబ్బ వెంకట రమణమ్మ, ఏపీ సిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుడుముల వెంకటరమణ, మండల ఉపాధ్యక్షులు సత్తిబాబు, కదుల్ల గిరిజాకుమారి, సీనియర్ ఉపాధ్యాయులు తగ్గి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments