విద్యార్థులు-ఉపాధ్యాయుల అనుబంధానికి ప్రతిరూపం ఉపాధ్యాయ దినోత్సవం
మదర్ థెరిస్సా కళాశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు
అల్లూరి జిల్లా, చింతపల్లి సెప్టెంబర్ 5 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): చింతపల్లిలోని మదర్ థెరిసా ఒకేషనల్ జూనియర్ కళాశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 137వ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను కళాశాల కరస్పాండెంట్ కృష్ణ కాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ కృష్ణకాంత్ మాట్లాడుతూ, విద్యార్థుల జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంత గొప్పదో వివరించారు. ఒక విద్యార్థి ఉత్తమ పౌరుడిగా ఎదగడానికి బలమైన పునాదిని ఉపాధ్యాయులే వేస్తారని ఆయన అన్నారు. తల్లి బిడ్డకు జన్మనిస్తే, ఉపాధ్యాయులు ఆ బిడ్డ జీవితానికి దిశానిర్దేశం చేస్తారని, వారు జ్ఞానాన్ని, నైపుణ్యాలను మాత్రమే కాకుండా, క్రమశిక్షణను మంచి నడవడికను కూడా నేర్పిస్తారనీ ఇది ఒక బలమైన బంధమని అన్నారు. నిరాశలో ఉన్న విద్యార్థులకు స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని అందిస్తారని, వారు కేవలం గురువులుగా మాత్రమే కాకుండా, ఒక మంచి స్నేహితుడిగా, తత్వవేత్తగా కూడా ఉంటారని అన్నారు. విద్యార్థులు తమ ఉపాధ్యాయులు చూపించే మార్గాన్ని అనుసరించాలని, అది వారి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని ఆకాంక్షించారు. అనంతరం ఉపాధ్యాయులకు విద్యార్థులు పుష్పగుచ్ఛాలు అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య ఉన్న ఆప్యాయత, గౌరవాన్ని చాటి చెప్పింది. ఈ వేడుకలో కళాశాల ప్రిన్సిపాల్ వి. వెంకన్న, సిబ్బంది కమల కుమారి, మీనా కుమారి, రామకృష్ణ, సాయి, రుక్మిణి, రామకృష్ణతో పాటు విద్యార్థులందరూ పాల్గొన్నారు.
0 Comments