ఉపాధ్యాయుల వేషధారణలో చిన్నారులు
చింతపల్లి సెప్టెంబర్ 5 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో భాగంగా మండలంలోని కొత్తపాలెం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయురాలు వనబసింగి వరలక్ష్మి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు భగత్ రాం ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఉపాధ్యాయులు పాఠశాలకు రాగానే విద్యార్థులు ఉపాధ్యాయ ఉపాధ్యాయుని వేషధారణలతో స్వాగతం పలుకుతూ వారికి పూలమాలలు, పుష్పగుచ్ఛాలు ఇచ్చి పాదాలకు నమస్కరించి, శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమ భవిష్యత్తును తీర్చిదిద్దే గురువులకు ఇలా గౌరవం ఇవ్వడం ఎంతో సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుందని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువులను గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని, గురువుల గొప్పతనాన్ని చాటిచెప్పే విధంగా విద్యార్థులు ముందుండాలని తెలిపారు. తమను ఆప్యాయంగా పలకరించిన విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు ఇలా తమను గౌరవించడం చాలా ఆనందంగా ఉందని, వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో సెగ్గె చరణ్ సత్య దేవ్, కిల్లో సువర్ణ, ధారలక్ష్మీ, పవిత్ర, నాగలక్ష్మి, జయమాధురి, గోపినాయక మేఘన, దుర్గాభవాని లు ఉపాధ్యాయ, ఉపాధ్యాయినీ వేషధారణలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కూడ సత్తిబాబు, రాంబాబు, మత్స్యరాజు, రజిని, సెగ్గె ఈశ్వరి, ప్రసాద్, పాంగి శ్రీను (కువి మాతృభాష), అధిక సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
0 Comments