పరిసరాల పరిశుభ్రతతోనే స్వచ్చాంద్ర లక్ష్యం సాధ్యం
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
ఎంపీపీ అనూష దేవి
చింతపల్లి సెప్టెంబర్ 20 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): మన గ్రామాలు, మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రతతో పాటు మొక్కలు నాటడం ద్వారానే హరితాంధ్రతో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యం సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ తమ బాధ్యతగా తీసుకోవాలని చింతపల్లి ఎంపీపీ కోరాబు అనూష దేవి అన్నారు. నెలలో మూడవ శనివారం హరితాంధ్ర థీమ్ తో స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని చింతపల్లి ఎంపీడీవో సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ అనూష దేవి, చింతపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ దురియా పుష్పలత, తెదేపా మండల అధ్యక్షుడు కిలో పూర్ణచందర్రావు, జనసేన మండల అధ్యక్షుడు వంతల బుజ్జిబాబు, బిజెపి నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా ఎంపీడీవో కార్యాలయం నుండి గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల వరకు స్వచ్ఛత పై అవగాహన కల్పిస్తూ భారీ బహిరంగ ర్యాలీ నిర్వహించి, గురుకుల కళాశాలలో విద్యార్థులతో కలిసి మానవహారం చేపట్టారు. అనంతరం గురుకుల జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీపీ అనూష దేవి మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత ఎంత ముఖ్యమో సమాజంలో పరిసరాల పరిశుభ్రత కూడా అంతే ముఖ్యమన్నారు. మన పరిసరాలు ఎంత పరిశుభ్రత గా ఉంటాయో అంతే ఆరోగ్యంగా ప్రజలు ఉంటారన్నారు. పర్యావరణ అసమతుల్యతలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలన్నారు. అప్పుడే స్వచ్ఛాంధ్రతో స్వర్ణాంధ్ర లక్ష్యం పూర్తవుతుందని ఆమె పేర్కొన్నారు. పచ్చదనమే మన ప్రాణాధారంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడి భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన కాలుష్య రహిత వాతావరణాన్ని అందించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారంతా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ టిడిపి బీసీ సెల్ ఉపాధ్యక్షుడు లక్కోజు నాగభూషణం, ఎస్.కె. కాశీంవల్లి, మర్రి మంగులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కిముడు కృష్ణమూర్తి, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి కదుల్ల శ్రీనువాసరావు, జనసేన నాయకుడు మధు, వెలుగు సిబ్బంది, జాతీయ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
0 Comments