పాఠశాల విద్యార్థుల కష్టాలను తీర్చిన సర్పంచ్ - సొంత నిధులతో భోజన గది నిర్మాణం - చింతపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ పుష్పలత

పాఠశాల విద్యార్థుల కష్టాలను తీర్చిన సర్పంచ్
సొంత నిధులతో భోజన గది నిర్మాణం 

చింతపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ పుష్పలత 

అల్లూరి జిల్లా, చింతపల్లి  సెప్టెంబర్ 20 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) :  చింతపల్లి మేజర్ పంచాయతీలోని గడప రాయి గ్రామంలోని ఎంపీయూపీ పాఠశాల విద్యార్థులకు సర్పంచ్ దురియా పుష్పలత అండగా నిలిచారు. పాఠశాలలో అదనపు గదులు లేకపోవడంతో, పిల్లలు కూర్చుని చదువుకోవడానికి, భోజనం చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన స్థానిక ఉపాధ్యాయుడు వసుపరి శామ్యూల్, సర్పంచ్ దురియా పుష్పలత దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న సర్పంచ్ పుష్పలత, ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడకుండా వెంటనే స్పందించారు. తన సొంత నిధులతో పాఠశాలకు ఒక అదనపు గదిని నిర్మించి, విద్యార్థుల కష్టాలను తీర్చారు. దీంతో విద్యార్థులకు చదువుకోవడానికి, భోజనం చేయడానికి తగినంత స్థలం ఏర్పడింది. సర్పంచ్ దురియా పుష్పలత చూపిన చొరవకు గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి ఆదర్శనీయమైన నాయకులు సమాజానికి ఎంతగానో అవసరమని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు. ఆమె చేసిన ఈ పనిని హర్షిస్తూ గ్రామస్తులు ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Post a Comment

0 Comments