ఐటీడీఏ పీఓకు వినతి పత్రాన్ని సమర్పించిన పది గ్రామాల గ్రామస్తులు
జనసేన పెదబరడ పంచాయతీ అధ్యక్షుడు రామకృష్ణ
అల్లూరి జిల్లా, చింతపల్లి సెప్టెంబర్ 12 (సురేష్ కుమార్ పాడేరు స్టాఫ్ రిపోర్టర్): మండలంలోని పెదబరడ పంచాయతీలో ఆయా గ్రామాల ప్రజల సౌకర్యార్థం రెండో సచివాలయం ఏర్పాటు చేయాలని జనసేన పెదబరడ పంచాయతీ అధ్యక్షుడు కూడ రామకృష్ణ ఆధ్వర్యంలో చింతలూరు, వంగసార, పెద్దగడ్డ, కొమ్మల బంధ, నక్కల మెట్ట, గున్నమామిడి, నరహరి వీధి, లోతుగడ్డ జంక్షన్, భీమన్న వీధి, కృష్ణాపురం గ్రామస్తులు సుమారు 19 వందలమంది సంతకాలతో శుక్రవారం పాడేరు ఐటీడీఏలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ తిరుమణి శ్రీ పూజకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి జనసేన నాయకుడు రామకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం పెదబరడ పంచాయతీలో ఉన్న సచివాలయం పరిధిలోని ఆ 10 గ్రామాలలో సుమారు 4500 పై చిలుకు జనాభా కలిగి ఉన్నామని, సచివాలయ సేవలు పొందాలంటే సుదూర ప్రాంతమైన పెదబరడ ఆయా గ్రామాలకు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉందని అన్నారు. దీనివల్ల వివిధ ధ్రువపత్రాల అవసరాల నిమిత్తం, అలాగే సంక్షేమ పథకాల సమాచారం నిమిత్తం సచివాలయ సేవలు పూర్తిస్థాయిలో పొందలేకపోతున్నామని అన్నారు. అయితే గతంలో 2018-19లో రెండో సచివాలయం మంజూరైన కొందరి స్వార్థ రాజకీయాల కారణంగా అది కార్యరూపం దాల్చలేదని వాపోయారు. సచివాలయానికి దూరంగా ఉన్న గ్రామస్తులు క్యాస్ట్ సర్టిఫికేట్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు, ఆధార్ మార్పిడి వంటి అవసారల నిమిత్తము వ్యయప్రయాసలకోర్చి సుదూర ప్రాంతంలో ఉన్న సచివాలయంకి వెళ్లాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించి 10 గ్రామాల సౌకర్యార్థం రెండవ సచివాలయాన్ని మంజూరు చేసి అందుబాటులో ఉన్న ప్రాంతంలో నిర్మించాలని కోరారు. అదే క్రమంలో పెద్ద గడ్డ నుండి గున్న మామిడి వరకు రహదారి సౌకర్యాన్ని కల్పించాలని, అలాగే పంచాయతీ పరిధిలో పెండింగ్లో ఉన్న పింఛన్ ల మంజూరును వేగవంతం చేసి అవసరమైన వారికి పింఛన్ పంపిణీ చేపట్టాలని పిఓ ను కోరారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సంకాడ పంచాయతీ అధ్యక్షులు ఊలం ఈశ్వరరావు, ఆయా గ్రామస్తులు కొర్ర సతీష్, గెమ్మెలి సాయిబాబు, గెమ్మెలి నాయుడు, కిల్లో శ్రీను, పాంగి చందు, గెమ్మెలి తేజ తదితరులు పాల్గొన్నారు.
0 Comments