కాఫీ బెర్రీ బొర్రర్ నివారణపై రైతులకు అవగాహన
మండల వ్యవసాయ విస్తరణ అధికారి ధర్మరాయి
అల్లూరి జిల్లా, చింతపల్లి సెప్టెంబర్ 1(సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : మండలంలోని అంజలి శనివారం పంచాయతీ పరిధిలో బూసులకోట గ్రామంలో కాఫీ కాయ తొలుచు పురుగు (కాఫీ బెర్రీ బోర్రర్) నివారణపై సోమవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక సర్పంచ్ పేట్ల రాజుబాబు, సిపిఐ మండల కార్యదర్శి పేట్ల పోతురాజుల ఆధ్వర్యంలో బూసులకోట, ఉసిరిపుట్టు, మాడెంబంద గ్రామాల కాఫీ రైతులతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) పి ధర్మరాయి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఈఓ ధర్మరాయి మాట్లాడుతూ, కాఫీ ప్రస్తుతం గిరి రైతులకు జీవనాధారంగా మారిందని, ఇలాంటి సమయంలో కొత్తగా 'కాఫీ బెర్రీ బోర్రర్' వ్యాధి రావడం దురదృష్టకరమని అన్నారు. సదస్సులో పాల్గొన్న రైతులకు ఈ పురుగు సోకకుండా నివారణకు చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. అందులో ప్రధానంగా తోటలో ఎండిన కొమ్మలు, రాలిపోయిన కాఫీ పండ్లు, ఆకులు ఎప్పటికప్పుడు తొలగించి కాల్చివేయాలని, పూర్తిగా పండిన కాఫీ కాయలను మాత్రమే కోయాలని, చెట్టుకు ఉన్న పచ్చి కాయలను పురుగు ఆశించదని తెలిపారు. పురుగు ఆశించిన కాయలను గుర్తించి వాటిని వెంటనే తొలగించి, పురుగు వ్యాప్తి చెందకుండా కాల్చివేయాలని, వేప నూనె వంటి సహజ సిద్ధమైన పురుగు మందులను వాడటం ద్వారా పురుగు వ్యాప్తిని తగ్గించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక లయిజన్ వర్కర్ గిరి ప్రసాద్, మండల ఎఫ్‌సీలు బాలకృష్ణ, విశ్వాస్, సీఎల్డబ్ల్యూలు రమణబాబు, చంటిబాబు, బీఓడీ కృష్ణ, బూసులకోట, ఉసిరిపుట్టు, మాడెంబంద గ్రామాలకు చెందిన కాఫీ రైతులు పాల్గొన్నారు.
0 Comments