సీనియర్ నాయకులు పార్టీని వీడడం విచారకరం
ఎందరు వీడినా మన్యంలో వైకాపా గెలుపును ఆపలేరు
వైకాపా రాష్ట్ర గిరిజన విభాగం ప్రధాన కార్యదర్శి సుధాకర్
చింతపల్లి, ఆగస్టు 21(సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్లో ఒకరైన, మాజీ ఎంపీపీ వంతల బాబురావు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరడం విచారకరమని రాష్ట్ర గిరిజన విభాగం ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కొంతమంది స్వార్థపరులైన మాజీ ప్రజాప్రతినిధుల కారణంగా పార్టీ సీనియర్ నాయకులను కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది సామాన్య ప్రజలకు, వివిధ సామాజిక వర్గాలకు గుర్తింపు ఇచ్చిందని, అందులో భాగంగానే వంతల బాబురావును ఎంపీపీగా చేసిందని సుధాకర్ గుర్తు చేశారు. బాబురావు 2009లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంకా స్థాపించబడనప్పుడే, 'జగన్ బ్రిగేడ్' అనే పేరుతో తమతో కలిసి పనిచేశారని ఆయన పేర్కొన్నారు. ఆనాటి తమ కృషి వల్లే ఈరోజు ఏజెన్సీలో ముగ్గురు ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చారని ఆయన వివరించారు. గత రెండు నెలలుగా బాబురావు తనతో కూడా దూరంగా ఉంటున్నారని, బహుశా అందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని సుధాకర్ అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని, ఏజెన్సీలో పార్టీని ఎవరూ ఓడించలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ పెద్దలు ఇప్పటికైనా గతంలో జరిగిన పొరపాట్లను సమీక్షించుకుని, పార్టీ కోసం కష్టపడిన సీనియర్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.
0 Comments