గిరిజన చట్టాల రక్షణ కాంగ్రెస్‌తోనే సాధ్యం___కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు సుబ్బారావు

గిరిజన చట్టాల రక్షణ కాంగ్రెస్‌తోనే సాధ్యం
​పీసా ఎన్నికల విజయం కాంగ్రెస్ పూర్వ వైభవానికి నాంది

కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు సుబ్బారావు 

అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 27 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): ఆదివాసి చట్టాల రక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని, ఇటీవల జరిగిన పీసా కమిటీ ఎన్నికల విజయం కాంగ్రెస్ పూర్వవైభవానికి నాందికానుందని కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు వంతల సుబ్బారావు అన్నారు. బుధవారం పార్టీ శ్రేణులతో కలిసి చింతపల్లి -2లో ఇటీవల జరిగిన పీసా కమిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఉపాధ్యక్షుడిగా గెలుపొందిన కొర్ర మోహన్ రావును అభినందిస్తూ శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్యం ప్రాంతంలో కాంగ్రెస్కు పూర్వవైభవం రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గిరిజనుల సంక్షేమం అభివృద్ధికి, గిరిజన చట్టాల రక్షణ కోసం అండగా నిలబడే పార్టీ కాంగ్రెస్సేనని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి, కేంద్రంలో బిజెపి ప్రభుత్వాల వల్ల గిరిజన ప్రజలకు ఒరిగిందేమీ లేదని, గిరిజన చట్టాలు, హక్కుల రక్షణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపడం లేదన్నారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఐదవ షెడ్యూల్ ప్రాంతమైన మన్యం ప్రాంతంలో 1/70 భూ బదలాయింపు చట్టాన్ని, పీసా కమిటీలను పటిష్టంగా అమలు చేస్తూ గిరిజనుల సంక్షేమానికి అభివృద్ధికి ఆసరాగా నిలిచిందని, నేడు అధికార పార్టీలు చట్టాలను నీరు గారుస్తూ మన్యం ప్రాంతంలో అమూల్యమైన ఖనిజ సంపదను దోచుకునేందుకు, అక్రమ మైనింగ్ ను చేపట్టేందుకు పన్నాగాలు పన్నుతూ, అభివృద్ధి పేరిట చట్టాలను నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. మన్యం వాసుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నమ్మకం పోయిందని, చట్టాలు సక్రమంగా అమలు కావాలంటే కాంగ్రెస్ రావాల్సిందేనని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. దానికి నిదర్శనమే పీసా కమిటీ ఎన్నికలలో కాంగ్రెస్ మద్దతుతో ఉపాధ్యక్షుడిగా గెలుపొందిన మోహన్ రావు అని అన్నారు. గిరిజన చట్టాలు హక్కుల రక్షణలో భాగమవుతూనే ఈ ప్రాంత అభివృద్ధికి మోహన్ రావు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ చిన్న విజయంతో ముందుకు సాగుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, అలాగే మన్యంలో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు ప్రతి కార్యకర్త కంకణబద్దులవ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం పీసా ఉపాధ్యక్షుడు మోహన్ రావు మాట్లాడుతూ తన ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ఈ ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కిల్లో చిరంజీవి, సీనియర్ నాయకులు మర్రి గురుమూర్తి, పాంగి శ్రీనుబాబు, గెమ్మెలి సింహాద్రి, మొట్టడం బాలరాజు, వంతల సత్యనారాయణ, తంబేలీ ఆనంద్, మర్రి సూర్యనారాయణ, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments