అందరి సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యం__పిసా కమిటీ ఉపాధ్యక్షుడు మోహన్ రావు

సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యం
పిసా కమిటీ ఉపాధ్యక్షుడు మోహన్ రావు

అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 25 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): అధికారులు, ప్రజాప్రతినిధుల సమిష్టి కృషితోనే పంచాయతీల అభివృద్ధి సాధ్యమవుతుందని నూతనంగా ఎన్నికైన పీసా కమిటీ ఉపాధ్యక్షుడు కొర్ర మోహన్ రావు అన్నారు. ఇటీవల వాయిదా పడిన పీసా కమిటీ ఎన్నికలను సోమవారం చింతపల్లి-2 చిన్నగెడ్డ బూత్ లో ఎన్నికల పర్యవేక్షణ అధికారి ఎస్ లక్ష్మణకుమార్ ఆధ్వర్యంలో స్థానిక మేజర్ పంచాయతీ సర్పంచ్ దురియా పుష్పలత అధ్యక్షతన నిర్వహించారు. ఉపాధ్యక్షుల పదవికి కాంగ్రెస్ పార్టీ నుంచి గడపరాయి గ్రామానికి చెందిన కొర్ర మోహన్ రావు పోటీ చేయగా, వైకాపా పార్టీ నుంచి చిన్న గడ్డ గ్రామస్తుడు వేములపూడి పరమేశ్వరరావు నిలవడంతో ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఎన్నికల అధికారి పర్యవేక్షణలో గడపరాయి, కందులగాధి, చిన్నగెడ్డ, మల్లవరం గ్రామాల ప్రజలతో ఇరువురికి ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 406 మంది ఓటర్లు పాల్గొన్న ఈ ఎన్నికలో మోహన్ రావుకి 226 ఓట్లు పోలవగా, పరమేశ్వరరావుకి 186 ఓట్లు పోలయ్యాయి. దీంతో 43 ఓట్ల మెజారిటీతో మోహన్ రావు గెలుపొందారు. అదేవిధంగా కార్యదర్శిగా మల్లవరం గ్రామస్థుడైన వంతల బాలకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పీసా కమిటీ ఉపాధ్యక్షుడు, కార్యదర్శి లను స్థానిక సర్పంచ్ పుష్పలత అభినందనలు తెలిపి ఘనంగా సత్కరించారు. అనంతరం మోహన్ రావు మాట్లాడుతూ తనకు మద్దతుగా నిలిచి, ఉపాధ్యక్షుడిగా గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. చింతపల్లి -2 పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్క గ్రామాల అభివృద్ధికి స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కృషి చేస్తామని, అదే విధంగా ఆదివాసీ హక్కులు, చట్టాలను పరిరక్షించుకుంటూ, సమర్థవంతంగా పని చేస్తామని పంచాయతీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన అధికారులకు, సహకరించిన గడపరాయి, కందులగాధి, చిన్నగెడ్డ, మల్లవరం గ్రామ ప్రజలకు  కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా గెలుపొందిన వారికి తెదేపా గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనంద్, కాంగ్రెస్, వైకాపా, కూటమి పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు అభినందనలు తెలిపారు.

Post a Comment

0 Comments