గణేష్ ఉత్సవ నిర్వహణకు ఆన్లైన్ నమోదు తప్పనిసరి_ చింతపల్లి సీఐ వినోద్ బాబు

గణేష్ ఉత్సవ నిర్వహణకు అనుమతులు తప్పనిసరి
చింతపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ బాబు 

అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 22 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : రాబోయే గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని చింతపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. వినోద్ బాబు అన్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు వినాయక చవితి ఉత్సవాలను మండలంలో ప్రశాంతంగా, ఆనందోత్సాహాలతో నిర్వహించేందుకు ముందస్తు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. గణేష్ విగ్రహ మండపాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ https://ganeshutsav.net ను సందర్శించి వివరాలను ఇచ్చి దరఖాస్తు చేసుకొని అనుమతి పత్రం పొందాలని తెలిపారు. అందులో ముందుగా దరఖాస్తుదారుడి మొబైల్ నంబర్ తో లాగిన్ అయి ఓటిపిను ఎంటర్ చేయాలని, ఆపై దరఖాస్తుదారుడి మిగిలిన వివరములు, కమిటీ సభ్యుల వివరాలు, విగ్రహాన్ని నిమజ్జనం చేసే తేదీ వంటి వివరాలను అందజేయాలన్నారు. అన్ని వివరాలు అందజేసిన తర్వాత దరఖాస్తుదారుడికి ఐ.డి నెంబర్ జనరేట్ అవుతుందని, తరువాత సింగిల్ విండో అధికారులు మీ గణేష్ విగ్రహ ప్రతిష్టాపన ప్రాంగణాన్ని సందర్శిస్తారని వివరించారు. తరువాత https://ganeshutsav.net/applicationStatus  కు నావిగేట్ చేయబడుతుందని, స్టేటస్ ను చెక్ చేసుకోవడానికి దరఖాస్తుదారు మొబైల్ నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుందని, ఆపై విజయవంతంగా ధృవీకరించబడిన తర్వాత, ఎన్ఓసి, క్యూఆర్ కోడ్, సూచనలను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. క్యూఆర్ కోడ్, ఎన్ఓసీలను లామినేట్ చేసి గణేష్ మండపాలపై ప్రదర్శనగా పెట్టాలన్నారు. అనంతరం గణేష్ ఉత్సవాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలను వివరించారు. అందులో ప్రధానంగా గణేష్ మండపాలను చర్చిలు, మసీదులకు దగ్గరలో, ట్రాఫిక్కు అంతరాయం కలిగించే రహదారులలో, వివాదాస్పద స్థలాలలో పెట్టరాదని సూచించారు. చందాలను బలవంతంగా వసూలు చేయరాదని, పూజలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉత్సవ కమిటీదేనని అన్నారు. మైక్ & సౌండ్ సిస్టంను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉపయోగించాలని, మండపాల వద్ద సీసీటీవీ కెమెరాలు వినియోగించాలని, లేనిపక్షంలో ఒక వ్యక్తి మండపం వద్ద ఉండేటట్టు చూడాలన్నారు. విద్యుత్ అలంకరణలలో షార్ట్ సర్క్యూట్లు కాకుండా జాగ్రత్త వహించాలనీ, అగ్ని నిరోధక కారకాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అన్న సంతర్పణకు ముందస్తుగా ఒక రోజు ముందు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలలో అశ్లీలత లేకుండా చూసుకోవాలన్నారు. నిమజ్జనం ఏ రోజున చేస్తారో ముందుగా సమాచారం ఇవ్వాలని, ఆరోజున చిన్న పిల్లలను వెంట తీసుకువెళ్లరాదని, బాణాసంచాను వినియోగించకూడదని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా రికార్డింగ్ డాన్స్, పేకాట వంటి జూద క్రీడలు నిషేధమన్నారు. పై వాటికి అతిక్రమిస్తే నిర్వాహకులపై కేసులు తప్పవని ఈ సందర్భంగా సిఐ వినోద్ బాబు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి ఎస్సై వెంకటేశ్వరరావు, అన్నవరం ఎస్సై వీరబాబు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments