ఆధార్‌తో తల్లికి వందనం కొట్టేసిన కేటుగాళ్లు
అయోమయంలో అభాగ్యురాలు… బ్యాంకుకు వెళ్ళినా ఫలితం శూన్యం
అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 23(సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలో ఆధార్ మోసం వెలుగుచూసింది. ప్రభుత్వ పథకం “తల్లికి వందనం” కింద లబ్ధిదారిణి ఖాతాలో పడిన డబ్బులను కేటుగాళ్లు కొట్టేసిన ఘటన మండలంలోని అంజలి శనివారం పంచాయతీలో చోటుచేసుకుంది. అంజలి శనివారం పంచాయతీ చిన్నయ్యపాలెంకు చెందిన బాధితురాలు లకే పుష్పవతి వివరాల ప్రకారం. ఆమెకు నర్సీపట్నం స్టేట్ బ్యాంక్‌లో ఖాతా ఉంది. జూన్ 13న చింతపల్లి వచ్చి యూనియన్ బ్యాంక్ బయట పనిచేసే ఫినో నిర్వాహకుడి వద్ద తన ఖాతాలో తల్లికి వందనం డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకుంది. అప్పుడు నిర్వాహకుడు ఆమె ఖాతాలో 26,000 జమయ్యాయని చెప్పాడు. అప్పటికి డబ్బులు అవసరం లేక ఇంటికి వెళ్ళిపోయిన ఆమె వారం రోజుల క్రితం డబ్బులు తీసుకోవాలని చింతపల్లి వచ్చినప్పుడు తన ఖాతాలో డబ్బులు లేవని తెలుసుకొని ఖంగుతింది. ఏమైందో తెలుసుకోవడానికి నర్సీపట్నం స్టేట్ బ్యాంక్‌ను ఆశ్రయించిన పుష్పవతికి అక్కడి అధికారులు నువ్వు ఆధార్ ద్వారా బయట ఫినో వాళ్ల దగ్గర నుంచే డబ్బులు డ్రా చేసుకున్నావని చెబుతూ బ్యాంక్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. బ్యాంక్ స్టేట్‌మెంట్ ప్రకారం విత్‌డ్రా జూలై 2న 10,000, జూలై 3న 10,000, జూలై 6న 6,000, జూలై 7న 100 మొత్తం 26,100 ఆమె ఖాతా నుంచి విత్‌డ్రా అయినట్లు అధికారులు తెలిపారు.
మారిన ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం ఫినో ద్వారా విత్‌డ్రా చేస్తే నిర్వాహకుడి ఐడి నంబర్, పేరు తదితర వివరాలు చూపించాలి. కానీ పుష్పవతి విత్ డ్రా చేసిన ఖాతాలో మాత్రం డబ్ల్యూడిఎల్ టిఎఫ్ఆర్ 006359782424407528 ఏఇపిఎస్ ఓఎఫ్ఎఫ్యు ఇస్యూర్ డబ్ల్యూడిఎల్ టిఎక్స్ఎన్ 0099486105217 ఏటీ 14372 నర్సీపట్నం బజార్, అని మాత్రమే ఉందని ప్రతీ లావాదేవీకి ఏటీ 14372 నర్సీపట్నం బజార్ అని ఉందని ఆమె వాపోయారు. తనకు ప్రభుత్వం అందించిన తల్లికి వందనం సొమ్మును కేటుగాళ్లు దోచుకుపోయారని, ప్రభుత్వం, బ్యాంకు అధికారులు దీనిపై చర్య తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె పత్రికా ముఖంగా వేడుకున్నారు.
0 Comments