ఆదివాసి సంస్కృతి, సంప్రదాయాలతో పాటు హక్కులు, చట్టాలను కాపాడుకుందాం- దారెల సర్పంచ్ పాంగి పాండురంగ స్వామి

ఆదివాసి సంస్కృతి, సంప్రదాయాలతో పాటు హక్కులు, చట్టాలను కాపాడుకుందాం
ఆదివాసి జండా ఆవిష్కరిస్తున్న దారెల సర్పంచ్ పాండురంగ స్వామి 

దారెల సర్పంచ్ పాండురంగ స్వామి

అల్లూరి జిల్లా, ముంచింగిపుట్ ఆగస్టు 8 (పాంగి భాస్కర్ ముంచింగిపుట్ రిపోర్టర్) : ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు గిరిజనులకు జీవనాధారమైన హక్కులు, చట్టాలను కూడా కాపాడుకోవాలని టిడిపి నాయకుడు, దారెల పంచాయితీ సర్పంచ్ పాంగి పాండురంగ స్వామి అన్నారు. శుక్రవారం మండలంలోని దారెల పంచాయతీ కేంద్రంలో శనివారం (నేడు) నిర్వహించబోయే ఆదివాసి దినోత్సవ వారోత్సవాలలో భాగంగా స్థానిక ప్రజలతో కలిసి జండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, హక్కులను రక్షించుకోవాల్సిన ఆవశ్యకతపై వివరించారు. 1994 డిసెంబరులో ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రకటించిందని, ప్రపంచవ్యాప్తంగా సుమారు 174 దేశాలు ఈ తీర్మానాన్ని ఆమోదించాయని, ఆదివాసీల సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి సూచించిందని తెలిపారు. గిరిజనుల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ చేసిన కృషిని ఆయన గుర్తు చేశారు. నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో 275ను జారీ చేసి, గిరిజనుల సాంస్కృతి, సంప్రదాయాలు, భాషలను గౌరవించారని, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించారని పేర్కొన్నారు. గిరిజనుల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కృషి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని ఆయన అన్నారు.
అలాగే, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జారీ చేసిన జీవో నెం. 3 ద్వారా గిరిజన ప్రాంతంలో 100% ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గిరిజనులకు మాత్రమే కల్పించారని తెలిపారు. గిరిజనుల మనోభావాలను, సంప్రదాయాలను కాపాడింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమేనని పాండురంగ స్వామి స్పష్టం చేశారు. నేడు నిర్వహించబోయే అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మధు, గ్రామ కమిటీ అధ్యక్షులు చవిటియ గోపాలం, పీసా కమిటీ అధ్యక్షులు త్రినాధ్, పీసా కమిటీ ఉపాధ్యక్షులు మురళి, వార్డు మెంబర్ లోలిత్, వీఆర్ఏ లోహిదాస్, హార్టికల్చర్ అసిస్టెంట్ వరహాలమ్మ, సచివాలయం సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments