పీసా సభ్యులు గిరిజన చట్టాలు, హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి__కిటుముల సర్పంచ్ రమణమ్మ

పీసా సభ్యులు గిరిజన చట్టాలు, హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి
కిటుముల సర్పంచ్ రమణమ్మ 

అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 25 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): పిసా కమిటీలో నూతనంగా ఎన్నికైన ఉపాధ్యక్షులు, కార్యదర్శులు గిరిజన చట్టాలు, హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని కిటుముల సర్పంచ్ వనుము రమణమ్మ అన్నారు. ఇటీవల వాయిదా పడిన పిసా కమిటీ ఎన్నికలు సోమ, మంగళవారాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. సోమవారం కిటుముల పంచాయతీలో కిటుముల, బౌడ బూత్ లకు పిసా కమిటీ ఎన్నికలను పర్యవేక్షక అధికారులు కే. సతీష్, బి. నారాయణరావుల ఆధ్వర్యంలో, సర్పంచ్ రమణమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. కిటుముల బూత్లో వైఎస్‌ఆర్‌సీపీ తరఫున తాంబెల్లి దేవయ్య ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవగా, టీడీపీ నుంచి వనుము భీమన్న దొర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అలాగే, బౌడ బూత్లో వైఎస్‌ఆర్‌సీపీ నుంచి గడుతూరి రాంబాబు  ఉపాధ్యక్షుడిగా, టీడీపీ నుంచి సీందరి సన్యాసిరావు కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గెలుపొందిన వారిని సర్పంచ్ రమణమ్మ అభినందించి, శాలువాతో సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, పిసా కమిటీ సభ్యులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి, గిరిజన ప్రాంతాల్లో ఉన్న హక్కులను పటిష్టంగా అమలు చేసి, ఈ ప్రాంతాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. మంగళవారం జరగబోయే పకాబు గ్రామంలోని పిసా ఎన్నిక కూడా సజావుగా సాగేలా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు సహకరించాలని కోరారు. గతంలో నిలిచిపోయిన ఎన్నికలను ఈసారి ప్రశాంతంగా నిర్వహించిన ఎన్నికల అధికారులకు, కూటమి, వైకాపా నాయకులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వనుము పద్మ, వార్డు సభ్యులు, వైఎస్‌ఆర్‌ మాజీ ట్రైకార్ డైరెక్టర్ సుర్ల లోవరాజు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments