దమ్మున్న జర్నలిస్ట్ లీడర్ రమణమూర్తి.. ఇలాంటి జర్నలిస్టు నేటి సమాజానికి అవసరం : ఏపీయూడబ్ల్యూజే ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు సిహెచ్.బి.ఎల్. స్వామి

నర్సీపట్నం ఫిబ్రవరి 16: పత్రిక పేరునే తన ఇంటిపేరుగా ప్రజలతో పిలవబడుతున్న విల్లూరి వెంకటరమణమూర్తి ఒక అరుదైన జర్నలిస్టు. భయం అంటే తెలీదు. నోటీసులు ఇచ్చి భయ పెడితే , భయపడిపోయే జర్నలిస్టు కాదు రమణమూర్తి. ఎన్నో పరిశోధనాత్మక కథనాలతో, రాష్ట్ర ప్రభుత్వాలనే కదిలించిన అసాధారణ జర్నలిస్టు రమణమూర్తి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేసిన ఏలేరు కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకు వచ్చిన జర్నలిస్ట్ ఆయన. పీపుల్స్ వార్ పార్టీ అధినేత కొండపల్లి సీతారామయ్యను కలిసి తొలిసారిగా ఇంటర్వ్యూను చేసిన జర్నలిస్టు ఆయన. అప్పట్లో ఉదయం పత్రికలో సీరియల్ గా ప్రచురితమైన కొండపల్లి సీతారామయ్య ఇంటర్వ్యూ చదవడం కోసం ఉదయం పేపర్ కొనుక్కోడానికి రాష్ట్రంలో అనేక చోట్ల పెద్దపెద్ద క్యూలైన్లు ఉండేవంటే ఒక జర్నలిస్టుగా మనందరం గర్వపడాల్సిన విషయం. వరంగల్ లో అయితే క్యూలైన్లను కంట్రోల్ చేయలేక, పోలీసులు లాఠీ చార్జీ చేసిన అరుదైన ఘటన ప్రపంచ జర్నలిజం చరిత్రలోనే ఒక విశేషమైన ఘటనగా చెప్పవచ్చు. ఇప్పటి సిపిఐ మావోయిస్టు పార్టీ అధినేత గణపతిని కూడా ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ రమణమూర్తి. విశాఖ కేజీహెచ్ లో కన్యత్వ పరీక్షలు, విశాఖ కేంద్రంగా జరుగుతున్న ఎన్నో మాఫియా వ్యవహారాలను తన లీడర్ పత్రిక ద్వారా వెలుగులోకి తీసుకువచ్చి జర్నలిస్టులకే ఆదర్శప్రాయుడయ్యారు. రమణమూర్తి మా జర్నలిస్ట్ అని చెప్పుకోగలిగే స్థాయిలో కథనాలను సమాజానికి అందించారు. ఒక జర్నలిస్ట్ పేరు ప్రఖ్యాతులు పొందినప్పుడు బురద చల్లడం కూడా వెనువెంటనే ఉంటుంది. కానీ రమణమూర్తి విషయంలో ఇలాంటి చిల్లర వ్యవహారాలు ఎవరూ నమ్మలేదు. పట్టించుకోలేదు. ఎందుకంటే ప్రాణాలకు తెగించి రమణమూర్తి వెలుగులోకి తీసుకు వస్తున్న వార్తా కథనాలే ఇందుకు కారణం. అందుకే చెబుతున్నాం భయపెడితే భయపడడానికి రమణమూర్తి అలాంటి, ఇలాంటి జర్నలిస్టు కాదు. ఇలాంటి జర్నలిస్టులను, పత్రికలను, కాపాడుకోవడం సమాజానికి అవసరం. ప్రజా చైతన్యం కోసం, అణచివేయబడుతున్న,దోపిడీకి గురవుతున్న వర్గాల ప్రజల కోసం, తన కలాన్ని బలంగా మార్చుకొని ప్రజల పక్షాన నిలబడుతున్న రమణమూర్తికి ప్రతి ఒక్కరు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. లీడర్ రమణమూర్తికి విశాఖ ఆర్డీవో శ్రీలేఖ నోటీసులు ఇవ్వడం, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు అయిన భావ ప్రకటన స్వేచ్ఛను సవాల్ చేయడమే. వెంటనే నోటీసు ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే) ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు సిహెచ్.బి.ఎల్. స్వామి డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment

0 Comments