ప్రభుత్వ వైఫల్యం వల్లనే వాముగెడ్డలో శిశు మరణాలు సంభవించాయని చింతపల్లి ఎంపీపీ కోరాబు అనూష దేవి అన్నారు. శనివారం ప్రజాప్రతినిధులతో కలిసి ఎంపీపీ మాట్లాడుతూ, 20 రోజుల వ్యవధిలో వాముగెడ్డ గ్రామంలో ముగ్గురు శిశువులు మరణిస్తే వాస్తవాలను దాచే ప్రయత్నం గిడ్డి ఈశ్వరి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఒకే గ్రామంలో ముగ్గురు శిశువులు మరణించిన తర్వాత వైద్య సిబ్బంది గ్రామాన్ని సందర్శించి హడావిడి చేస్తున్నారని, శిశువులు మరణాలకు ముందే ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితి దాపురించేది కాదని ఆమె అన్నారు. వైసిపి ప్రభుత్వం హయాంలో గర్భిణీ స్త్రీలకు వసతి గృహాలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించడం వల్ల మాత శిశు మరణాలను అరికట్టగలిగామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సరియైన పరియవేక్షణ లేక శిశు మరణాలు జరుగుతున్నాయని అన్నారు. ఒకే గ్రామం లో ముగ్గురు చిన్నారులు మరణిస్తే కనీసం ఆ కుటుంబాలను పరమార్శచించని గిడ్డి ఈశ్వరి వాస్తవాలను ప్రక్కన పెట్టి, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపే వైసిపి నాయకులపై విమర్శలు చేయడం అనైతికమన్నారు. మృతుల కుటుంబాలను పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు పరామర్శించి మనోధైర్యం కల్పించారన్నారు. శిశు మరణాలు జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ బాధ్యులైన వైద్యులపై కనీస చర్యలు తీసుకోవడం కూటమి ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ఇప్పటికైనా గిరిజన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు మాతా శిశు మరణాల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఫోరం అధ్యక్షులు దురియా పుష్పలత, వైసీపీ ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.
0 Comments