ఈ ఆత్మీయ సమావేశానికి అనకాపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే గణేష్ నిర్వహించే కార్యక్రమాలకు గత కొంతకాలంగా దూరంగా ఉంటున్న వేములపూడి కి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోలెం నరసింహమూర్తి, నర్సీపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసి పాత్రుడు ( జమీల్ )ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటివరకు ఎమ్మెల్యే గణేష్ కు నియోజకవర్గంలోని సీనియర్ నాయకులతో దూరం పెరిగిందని, ఎన్నికల్లో వారు పూర్తయిలో సహకరిస్తారా, లేదా, అనే అనుమానాలు కార్యకర్తల్లో ఉండేవి. బుధవారం జరిగిన ఆత్మీయ సమావేశంలో ఈ అనుమానాలు పటాపంచలు అయ్యాయి. ఎంపీ, అసెంబ్లీ స్థానాలను గెలిపించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని సీనియర్ నేతలు చేసిన ప్రసంగాలు, కార్యకర్తల్లో అనుమానాలను తొలగించాయి. నర్సీపట్నం మండలం వేములపూడి, మెట్టపాలెం పంచాయతీల్లో బలమైన ఓటు బ్యాంకు కలిగిన వైసీపీ నాయకులు బోలెం నరసింహమూర్తి గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనటం లేదు. అయితే ఆయన కుమారుడు వేములపూడి ఎంపీటీసీ వెంకటేష్ మాత్రం, ఎమ్మెల్యే గణేష్ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి హాజరవుతున్నారు. బుధవారం ఎంపీ అభ్యర్థి ముత్యాల నాయుడు పాల్గొన్న కార్యక్రమానికి నరసింహమూర్తి హాజరై వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని చేసిన ప్రసంగంతో పార్టీలో నేతల మధ్య సమన్వయం లేదని జరుగుతున్న ప్రచారానికి పుల్ స్టాప్ పడింది .అలాగే 2019 ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన చింతకాయల సన్యాసి పాత్రుడు సతీమణికి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవిని ఇచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీలో జమీల్ కు కీలకమైన ప్రాధాన్యత ఇచ్చారు. అయితే జమీల్ కు, ఎమ్మెల్యే గణేష్ కు మధ్య గత కొంతకాలంగా కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని ప్రచారం సొంత పార్టీ కార్యకర్తల్లోనే ఉంది. అయితే జమీల్ కుమారుడు దొర మాత్రం ఎమ్మెల్యే సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతూనే ఉన్నారు. బుధవారం జరిగిన ఆత్మీయ సమావేశంలో సన్యాసి పాత్రుడు చేసిన ప్రసంగం కార్యకర్తలను ఆకట్టుకుంది. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని కూడా నింపింది. సీనియర్ నేతలు పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని చేసిన ప్రసంగాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉన్న అనుమానాలు తొలగిపోయాయి. పార్టీ నేతలంతా ఒకే తాటిపైకి రావడంతో గెలుపు ఖాయం అనే ధీమా వైయస్సార్ పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నది. ఎమ్మెల్యే గణేష్ సైతం తనదైన రీతిలో వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. 30 వేల మెజార్టీ సాధించడం ఖాయం అనే ధీమాతో ఉన్నారు. ఎమ్మెల్యే గణేష్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నూతనంగా చేరికలు కూడా భారీగానే సాగుతున్నాయి. ఒకవైపు సీనియర్ నాయకులతో సఖ్యతగా ఉంటూనే ,మరోవైపు రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడం పై దృష్టి సారించారు. అలాగే బలమైన ఓటు బ్యాంక్ కలిగిన నేతలను పార్టీలోకి ఆహ్వానించడంలో సైతం ఎమ్మెల్యే గణేష్ వెనకడుగువేయడం లేదు. గెలుపే లక్ష్యంగా దూసుకు పోతున్నారు.ఈ దఫా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిస్తే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే బలమైన నమ్మకం కార్యకర్తల్లోనూ, నాయకుల్లోనూ ఉంది. ఇదే విషయాన్ని నేరుగా చెప్పకపోయినా, ఆత్మీయ సమావేశంలో ప్రసంగించిన, పార్టీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు తన ప్రసంగంలో చెప్పకనే చెప్పేశారు. దీంతో ఎమ్మెల్యే గణేష్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని నాయకులు, కార్యకర్తలు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.ఈ పరిణామాలన్నీ నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి సానుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
0 Comments