ఆదివాసీల పట్ల అంకితభావంతో పని చేస్తున్న వైద్యాధికారికి డీకే హిమబిందుకి ఉత్తమ పురస్కారం

*ఆదివాసీల పట్ల అంకితభావంతో పని చేసే వైద్యాధికారికి డీకే హిమబిందుకి ఉత్తమ పురస్కారం
*గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేతుల మీదుగా విశిష్ట సేవా పురస్కారం అందుకున్న వైద్యాధికారి
సీలేరు జనవరి 26:
వృత్తి దైవంగా, ఆదివాసీల ఆరోగ్యం కోసం అనునిత్యం పరితపిస్తూ, అందుబాటులో ఉంటూ అత్యుత్తమ సేవలు అందిస్తున్న దారకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డీకే హిమబిందుకి ఉత్తమ సేవా పురస్కారం లభించింది. శుక్రవారం 75 వ గణతంత్ర దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని జిల్లా కేంద్రం పాడేరు లో కలెక్టర్ సుమిత్ కుమార్ వైద్యాధికారికి విశిష్ట సేవ ప్రశంస పత్రాన్ని అందజేశారు. వివరాల్లోకి వెళితే 2022 అక్టోబర్ లో మహిళ వైద్యాధికారిగా దారకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధుల్లోకి చేరిన డీకే హిమబిందు అతి తక్కువ కాలంలోనే ఆదివాసులకు దగ్గరయ్యారు. స్థానికంగా నివాసం ఉంటూ, 24 గంటల్లో ఏ సమయంలో ఆసుపత్రికి వచ్చిన వైద్య సేవలు అందిస్తూ ఆదివాసీల మన్ననలను అందుకుంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గ్రామాలను తరచూ సందర్శిస్తూ ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు రక్తహీనత కలిగిన మహిళలు, బాలికలు, గర్భిణులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మైదాన ప్రాంతాలకు పంపించిన రోగులు ఆసుపత్రి వైద్యులకు చెప్పా పెట్టకుండా స్వగ్రామాలకు వచ్చేస్తే విషయం తెలుసుకొని రోగుల వద్దకు వెళ్లి హిమబిందు ప్రత్యేక కౌన్సిలింగ్ చేసి తిరిగి వైద్యం పొందేందుకు ఎనలేని కృషి చేస్తున్నారు. ఆమె ఆదివాసులకు అందిస్తున్న సేవలను గుర్తించిన రాష్ట్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ గత ఏడాది రాష్ట్రస్థాయిలోనే అత్యుత్తమ సేవ పురస్కారాన్ని అందజేశారు. 
తాజాగా జిల్లాస్థాయిలో గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ విశిష్ట సేవ పురస్కారాన్ని అందజేశారు. ఆదివాసుల పట్ల అంకిత భావంతో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తూ ప్రాంతీయుల మన్ననలతో పాటు, జిల్లాస్థాయి అధికారుల గుర్తింపు లభించడం శుభ పరిణామమని వైద్యాధికారిని స్థానికులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఈ సందర్భంగా వైద్యాధికారి విలేకరులతో మాట్లాడుతూ అత్యుత్తమ సేవా పురస్కారం అందుకోవడంతో తనపై మరింత బాధ్యత పెరిగింది అన్నారు. రానున్న రోజుల్లో గిరిజన ప్రజలకు మరింతగా సేవలందించేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్, సబ్ కలెక్టర్ దాత్రి రెడ్డి, జిల్లా ఎస్పీ తుహాన్ సింహ, జాయింట్ కలెక్టర్ కార్తీక్ పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments