విశాఖపట్నం ఆగస్టు 29 : (పడాల శ్రీనివాసరావు, చీఫ్ ఎడిటర్ ) తెలుగు భాషా ఉద్యమ పితామహులు గిడుగు వెంకట రామమూర్తి అని ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ అధ్యక్షులు డా. ఎం.ఆర్.ఎన్.వర్మ అన్నారు. మంగళవారం మద్దిలపాలెం సమీపంలో ఉన్న యూజేఎఫ్ కార్యాలయంలో గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి వ్యవహారిక భాషలో ఉన్న తియ్యదనాన్ని, సౌలభ్యాన్ని తెలియజెప్పిన మహనీయులు గిడుగు రామమూర్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జననేత పత్రిక సంపాదకులు దాసరి శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషులు గిడుగు వెంకటరామమూర్తి అని అన్నారు. తెలుగు వ్యవహారిక భాష ఆవశ్యకతను అందరికీ తెలియజేసిన అచ్చ తెలుగు చిచ్చర పిడుగు గిడుగు అన్నారు. యూజేఎఫ్ సమన్వయకర్త డి. హరనాధ్ మాట్లాడుతూ గ్రాంధికంలో ఉన్న భాషను వ్యవహారిక భాషలోకి తీసుకురావడం వల్ల అందరికీ సౌలభ్యం ఏర్పడి ఏ కొద్దిమందికో పరిమితమైన విద్యను అందరూ అభ్యసించే విధంగా వీలు పడిందన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ ఎస్. నారాయణరావు మాట్లాడుతూ గిడుగు వెంకటరామమూర్తి వ్యవహారిక భాష అభివృద్ధికి చేసిన కృషిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
0 Comments