ప్రజల ఆకాంక్షల మేరకు అంకిత భావంతో అభివృద్ధికి కృషి:జిల్లా కలక్టర్ సుమిత్ కుమార్

పాడేరు, జనవరి 26(వి.డేవిడ్)  రాష్ట్ర విభజన తర్వాత గిరిజనుల కోసం మాత్రమే నూతన జిల్లా
ఏర్పడిందని,  కొత్త జిల్లా ఏర్పాటుతో ప్రజల్లో ఆశలు, ఆకాంక్షలు పెరిగాయని వారి ఆకాంక్షలకు అనుగుణంగా మనమందరం కలిసి పనిచేసి వారి ఆర్థిక, సామాజిక సంక్షేమాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు.  గురువారం 74 వ గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకొని ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించన కలెక్టర్ జిల్లా ప్రజలకు తన  సందేశాన్నిచ్చారు.  ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలో ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు బాధ్యత వహించాలని,  ప్రభుత్వ కార్యక్రమాలలో ఆశించిన ఫలితాలు సాధించేందుకు అంకిత భావంతో పని చేయాలని సూచించారు. 
ఏజెన్సీ ప్రాంతంలో భూ రికార్డులను మెరుగుపరచి ప్రజలకు ఇబ్బందులు లేని సేవలు అందించాల్సిన అవసరం ఉందని, ‘జగన్న భూ హక్క, భూ రక్షా కార్యక్రమం’ అనే శుభకార్యక్రమం కింద ప్రతి రైతుకు భూమిపై శాశ్వత హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.  35 వేల  భూ రెవెన్యూ మ్యుటేషన్లు, సర్వే రికార్డుల ప్రక్షాళన లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 294 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసామని, ఏడాది చివరి నాటికి వెయ్యి గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కింద ఇప్పటి వరకు గుర్తించిన 574 పనులకు గాను 17 విడతలుగా రూ.19 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేశామన్నారు. అన్ని ITDAల పరిధిలో అటవీ హక్కులను కల్పించేందుకు ఇప్పటి వరకు దాదాపు 1.40 లక్షల కుటుంబాలకు 2.80 లక్షల ఎకరాల భూమికి అటవీ హక్కు పత్రాలు అందించామన్నారు. 
జిల్లా ప్రజలకు కమ్యూనికేషన్ మరియు డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మెరుగుపరచడంలో భాగంగా, వివిధ ప్రాంతాలలో రోడ్ల నిర్మాణంతో పాటు Airtel, Jio, BSNL మొదలైన నెట్‌వర్క్ ల సేవల కోసం 2,129 సెల్ టవర్లను ఏర్పాటు చేస్తున్నామని త్వరలో వాటి సేవలు అందుబాటులోకి వస్తాయని కలక్టర్ తెలిపారు.  ఇంకా 20 శాతం ఆవాసాలు డోలీ నివాసాలుగా ఉన్నందున రహదారి మౌలిక సదుపాయాల కల్పన మరియు అనుసంధానం కాని ఆవాసాలను అనుసంధానం చేయడం సవాలుగా మిగిలిపోయిందని, వాటిని అధిగమించి  రాబోయే సంవత్సరాల్లో జిల్లాలో రోడ్ల మౌలిక సదుపాయాలు మెరుగు పడతాయని ఆశాభావం వ్యక్తం చేసారు. 
పోలీసు సూపరింటెండెంట్ నేతృత్వంలో ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి విధ్వంసం చేపట్టబడిందని, జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి గంజాయి దాదాపుగా తొలగించబడిందని, యువత సంఘ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనకుండా అవగాహన కల్పిస్తూ  ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని కలక్టర్ చెప్పారు. 
గిరిజన యువతకు ఉపాధి కల్పించడంలో భాగంగా స్కిల్ హబ్, స్కిల్ కాలేజ్ ద్వారా అనేక ఉపాధి శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, శిక్షణలు అందించటoతో పాటు  జాబ్ మేళాలు, నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పించామని, చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహక అభివృద్ధి సంస్థ (SIDBI) ద్వారా  కూడా శిక్షణా వర్క్ షాప్‌లను చేపట్టి చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు రుణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. 
జిల్లాలో పాఠశాలల మౌలిక సదుపాయాలను మెరుగు పరచడానికి, నాడు-నేడు కార్యక్రమం కింద 947 పాఠశాలలు, 127 అంగన్‌వాడీ కేంద్రాలు, 12 జూనియర్ కళాశాలల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 38 కోట్ల నిధులతో చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయని తెలియజేసారు.
గృహాలు లేని మొత్తం 58,456 మంది లబ్ధిదారులను గుర్తించి, అదనపు ఇళ్ల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని, ఇప్పటికే మంజూరైన  17,118 ఇళ్లను  ఈ ఏడాది పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. 
రైతు కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం రైతు భరోసా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సరఫరా చేస్తున్నామని, అగ్రికల్చర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో భాగంగా రూ. 1.36 కోట్ల సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేసామని తెలిపారు.  వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం-కిసాన్, జీరో వడ్డీ తదితర పధకాల కింద అర్హులందరికీ లబ్ది చేకూరుస్తున్నామని,  రైతులకు ఖరీఫ్‌లో రూ.374 కోట్లు, రబీలో రూ.206 కోట్లు పంట రుణాలు మంజూరు చేశామన్నారు.  ఈ ఏడాది పాలకవర్గం కృషి వల్ల రైతులు కాఫీ పంటను మంచి ధరకు అమ్ముకోగలిగారని, పసుపు, ఎండుమిర్చికి కూడా మంచి ధర వచ్చేలా కృషి చేస్తున్నామని  అన్నారు. 

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి దార్శనికత మేరకు జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, మనబడి నాడు-నేడు తదితర పధకాలు  ద్వారా విద్యా రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా జిల్లాలో ఈ ఏడాది 99,706 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 149.55 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. జగనన్న విద్యాదీవేన పథకం కింద ప్రభుత్వం పూర్తి ఫీజును కాలేజీ యాజమాన్యాలకు కాకుండా నేరుగా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తోంది. డిగ్రీ ఆపై చదివే విద్యార్థులకు ఏడాదికి రూ.20వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు, ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు ప్రభుత్వం మంజూరు చేస్తోంది.

పాడేరు ఏజెన్సీ పరిధిలోని అనంతగిరి మండలం నుండి కొయ్యూరు మండలం వరకు, రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో రంపచోడవరం నుంచి కొయ్యూరు వరకు ప్రభుత్వం మంజూరు చేసిన నాలుగు జాతీయ రహదారుల ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా చింతూరు ఐటీడీఏ పరిధిలో కుంట నుంచి భద్రాచలం వరకు ఎన్ హెచ్30,  చింతూరు నుంచి మోటు వరకు ఎన్ హెచ్ 326  జాతీయ రహదారుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కలక్టర్ స్పష్టం చేసారు. 

జల్ జీవన్ మిషన్ ద్వారా జిల్లాలో 2024 నాటికి ఇంటింటి కుళాయి ద్వారా ప్రతి వ్యక్తికీ 55 లీటర్ల తాగునీరు అందించేందుకు రూ. 630 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసామన్నారు.    ప్రజల తాగునీటి అవసరాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం 1250 ప్రాజెక్టులను మంజూరు చేసిందని, ఈ ఏడాది  చివరి నాటికి మొత్తం  ప్రాజెక్టులను పూర్తి చేసి త్రాగు నీరు అందించే దిశగా ప్రనాలికాయుతంగాకృషి చేస్తున్నామన్నారు. 

Post a Comment

0 Comments