అగ్రిటూరిజంపై మాట్లాడుతున్న ఎంపీ మాధవి
చింతపల్లి, అక్టోబరు 13:(వి.డేవిడ్)
ఆచార్య ఎన్టీరంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు రూపొందించిన అగ్రి టూరిజం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి అన్నారు. బుధవారం పరిశోధన స్థానం సందర్శించిన ప్రజాప్రతి నిధులు, అధికారులకు శాస్త్రవేత్తలు చిత్రీకరించిన అగ్రి టూరిజం నమూన లఘుచి
త్రాన్ని ప్రదర్శించారు. అనంతరం ఆర్ఎఆర్ఎస్ ఏడీఆర్ డాక్టర్ ఏం. సురేష్ కుమార్ అగ్రి టూరిజంపై ప్రసగించారు. విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి సహకారంతో చింతపల్లి పరిశోధన స్థానాన్ని అగ్రి టూజం స్పాట్గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. లంబసింగి వచ్చే పర్యాటకులు కుటుంబ సమేతంగా పరిశోధనస్థానాన్ని సందర్శించాలనేది తమ లక్ష్యమన్నారు. పరిశోధన స్థానంలో బెంబో రెస్టారెంట్ ఏర్పాటుచేసి గిరిజన ప్రాంతంలో లభించే చిరుధాన్యాల ఆహారం మాత్రమే పర్యాటకులకు విక్రయిస్తామన్నారు. పరిశోధన స్థానంలో జరుగుతున్న వివిధ పంట ప్రయోగాత్మక సాగు, మెడిషనల్ ప్లాంట్ సందర్శించి పర్యాటకులు స్వయంగా వరి నాట్లు వేయడంకి ఒక పొలాన్ని సిద్ధం చేస్తామన్నారు. సందర్శకులు వరి నాట్లు వేయడం, దుక్కి చేస్తూ ఎంజాయ్ చేసే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. స్థానిక చేపలు, కోళ్ల పెంపకం చెరువులో వలవేసి చేపలు పట్టే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే రెండు ఎకరాల్లో అరుదైన పూల సాగు చేపడుతున్నామన్నారు. పరిశోధన స్థానానికి వచ్చే పర్యాటకులకు పలు రకాల మొక్కలు విక్రయిస్తామన్నారు. పరిశోధన స్థానంలో అత్యాధునిక సదుపాయాలతో అతిథి గృహం కూడా అందుబాటులో ఉందన్నారు. ఈ సందర్శనకు ఒక్కొక్కరి నుంచి రూ .25 టిక్కెట్ వసూలు చేస్తామన్నారు. తాము తలపెట్టిన అగ్రి టూరిజానికి ప్రజాప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని ఏడీఆర్ కోరారు. దీనికి స్పందిస్తూ ఎంపీ మాధవి మాట్లాడుతూ శాస్త్రవేత్తల అగ్రి టూరిజం ఆలోచన అభినందనీయమన్నారు. పరిశోధన స్థానాన్ని సందర్శించే పర్యాటకులు కూర్చోవడానికి కాంక్రిట్ బెంచీలను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం కూడా అందజేస్తామన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన చింతపల్లికి మంచి గుర్తింపు తీసుకొచ్చేందుకు శాస్త్రవేత్తలు కృషిచేయాలన్నారు. జీసీసీ చైర్పర్సన్ మాట్లాడుతూ పరిశోధన స్థానంలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్గానిక్ జీసీసీ ఉత్పత్తులను పర్యాటకులు కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. జీసీసీ కాఫీ స్టాల్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో వ్యవసాయ మిషన్ చైర్మన్ నాగిరెడ్డి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, జెడ్పీచైర్పర్సన్ సుభద్ర, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
0 Comments