వికేంద్రీకరణ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై దూరదృష్టి కలిగిన యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వైయస్సార్సీపి ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, జి.మాడుగుల జడ్పిటిసి సభ్యులు డాక్టర్ మత్స్యరాస వెంకటలక్ష్మి అన్నారు. మంగళవారం చింతపల్లిలో పర్యటించిన ఆమె స్థానిక ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. మూడు రాజధానులు , వికేంద్రీకరణ కు మద్దతుగా ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నం సఫలీకృతం కావాలని అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అలాగే ఆమె 108 టెంకాయలు కొట్టి అమ్మవారికి మొక్కు చెల్లించారు. అనంతరం కరాటే శిక్షణ శిబిరాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కరాటే జిల్లా ముఖ్య శిక్షకులు బాకూరు పాండురాజు డాక్టర్ వెంకట లక్ష్మిని దు శాలువాలతో సన్మానించారు. అనంతరం ఆమె ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు. వికేంద్రీకరణ వల్ల అన్ని ప్రాంతాల ప్రజలు సమాన అభివృద్ధి సాధిస్తారన్నారు. ఉమ్మడి మద్రాస్, ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల ఒక ప్రాంతం ప్రజలకు జరిగిన అన్యాయం భవిష్యత్తులో పునరావృతం కాకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వికేంద్రీకరణ కు శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్రానికి చెందిన మెజారిటీ ప్రజలు, మేధావులు మూడు రాజధానులు మద్దతు ఇస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి తలపెట్టిన బృహత్తర కార్యక్రమానికి ప్రజలు మద్దతివ్వాలని ఆమె పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు పేరిట పంపిణీ చేస్తున్న పథకాలన్నీ అర్హులందరికీ అందజేయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కృతనిశ్చయంతో పని చేస్తున్నారని ఆమె తెలిపారు. అర్హులైన అప్పటికీ సంక్షేమ పథకాలు అందకపోతే ఎస్టీ సెల్ దృష్టికి తీసుకొని వస్తే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. దివ్యాంగులకు సదరం ధ్రువపత్రాలు అందజేసేందుకు, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేస్తామన్నారు. దివ్యాంగుల అందరికీ పింఛన్ అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జి.మాడుగుల మాజీ ఎంపీపీ మత్స్యరాస వెంకట గంగరాజు, చింతపల్లి మాజీ వైస్ ఎంపీపీ భూసరి కృష్ణారావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఉల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.
0 Comments