208 గ్రామాల్లో రూ .16.74 కోట్లతో జేజేఎం రక్షిత మంచినీటి పథకాలు: ఎంపీపీ కోరాబు అనుషదేవి

సమావేశంలో మాట్లాడుతున్న ఎం పీపీ కోరాబు అనుషదేవి
చింతపల్లి, (వి.డేవిడ్) అక్టోబరు 12:
మండలంలో 208 గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు రూ .16.74 కోట్ల జల్ జీవన్ మిషన్ పథకం నిధులతో రక్షిత మంచినీటి పథకాలను నిర్మించనున్నట్టు స్థానిక ఎంపీపీ కోరాబు అనుషదేవి అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆర్ డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులు ప్రజాప్రతినిధులతో జల్ జీవన్ మిషన్ పథకం పనులపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మండలానికి అత్యధిక సంఖ్యలో రక్షిత మంచినీటి పథకాలు మంజూరుకావడం వల్ల చాలా వరకు తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రజాప్రతినిధుల పర్యవేక్షణతో రక్షిత మంచి నీటి పథకాలు నాణ్యతతో నిర్మించుకోవాలన్నారు. ప్రతి గృహానికి రక్షిత మంచినీటి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలన్నారు. రక్షిత మంచినీటి పథకాలను సాధ్యమైనంత వేగంగా నిర్మించాలన్నారు. ఆర్ డబ్ల్యూఎస్ ఏఈఈ జి. స్వర్ణలత మాట్లాడుతూ మండలానికి 220 రక్షిత మంచినీటి పథకాలు మంజూరైనప్పటికి 12 గ్రామాల ప్రజలు ఇతర గ్రామాలకు వలస వెళ్లిపోయారన్నారు. 183 గ్రామాల్లో రూ.ఐదు లక్షలకు పైబడిన నిధులతో రక్షిత మంచినీటి పథకాలు నిర్మించేందుకు టెండర్లను ఆహ్వానిస్తున్నామన్నారు. 25 గ్రామాల్లో రూ.ఐదు లక్షలు లోపు నిధులతో నామినేటెడ్ పద్ధతిలో పనులు నిర్వహిస్తామన్నారు. 208 గ్రామాల్లో 80 పథకాలు ఆధునీకరణ, 26 సోలార్, 56 గ్రావిటీ, 21 సింగిల్ విలేజ్ పథకాలు నిర్మిస్తున్నామన్నారు. ఎంపీడీవో లాలం సీతయ్య మాట్లాడుతూ నామినేటెడ్ పనులకు పంచాయతీ సర్పంచ్, కార్యదర్శిలు తీర్మాణ పత్రాలను సకాలంలో అందజేపి పనులు ప్రారంభించుకోవచ్చునన్నారు.
ఈకార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు దురియా పుష్పలత, వైస్ఎంపీపీలు వెంగళరావు, శారద. సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments