చింతపల్లి(అన్వేషణ అప్ డేట్): సెలవుపై వెళ్లిన చింతపల్లి తహసిల్దార్ వివివి గోపాలకృష్ణ ఆదివారం విధుల్లో చేరారు. వివరాల్లోకి వెళితే.. చింతపల్లి తహసిల్దార్ గోపాలకృష్ణ గిరిజనులను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ చింతపల్లి మండలానికి చెందిన ఎంపీపీ వంతల బాబురావు, జడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య, మేజర్ పంచాయతీ సర్పంచ్ దురియా పుష్పలత ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు ఆందోళనలు, రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ మేరకు పాడేరు సబ్ కలెక్టర్ వి.అభిషేక్ సూచన మేరకు తహసిల్దార్ గోపాలకృష్ణ సెలవుపై వెళ్లారు. తాజాగా చింతపల్లి పర్యటనకు వచ్చిన జిల్లా కలెక్టర్ మల్లికార్జున తహసిల్దార్ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ప్రజాప్రతినిధులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షను ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఇది ఇలా ఉండగా సెలవుపై వెళ్లిన తహసిల్దార్ గోపాలకృష్ణ ఉన్నత అధికారుల సూచన మేరకు తిరిగి ఆదివారం విధుల్లోకి చేరారు. విధుల్లో చేరిన వెంటనే చింతపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో అక్రమంగా నిర్మిస్తున్న దుకాణ సముదాయాల నిర్మాణం తహసిల్దార్ నిలిపివేశారు.
0 Comments