చింతపల్లి, జనవరి 3(విఎస్ జే ఆనంద్): చింతపల్లి బీసీ వెల్ఫేర్ వసతి గృహం విద్యార్థినిలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కోరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను జనవరి ఒకటవ తేదీన చింతపల్లి బీసీ వెల్ఫేర్ వసతిగృహాన్ని సందర్శించానన్నారు. విద్యార్థినిలకు కనీస సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. సరైన వసతి లేదని, ఏళ్ల తరబడి ఐటీడీఏ అద్దె గృహంలోనే వసతిగృహాన్ని నిర్వహిస్తున్నారన్నారు. విద్యార్థులు పడుకునేందుకు బంకర్ బెడ్స్ కూడా లేవన్నారు. వసతి గృహ ఆవరణలో రన్నింగ్ వాటర్ సదుపాయం లేక బయటకు వెళ్లి పంచాయతీ కొలాయి నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారన్నారు. విద్యార్థులకు అవసరమైన మరుగుదొడ్ల సదుపాయం కూడా లేదని, రక్షిత మంచినీటి సదుపాయం కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లాస్థాయి అధికారులు దృష్టి సారించాలన్నారు. తక్షణమే విద్యార్థినిలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యార్థినీలు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి వేణు గోపాల కృష్ణ కి లేఖ పంపించామన్నారు.
0 Comments