* ఎస్టి కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు ప్రశ్నలకు నీళ్లు నమిలిన అధికారులు, * లోతుగడ్డ హెచ్ఎం పై దాడి ఘటనపై కమీషన్ విచారణ

* ఎస్టి కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు ప్రశ్నలకు నీళ్లు నమిలిన అధికారులు

* లోతుగడ్డ హెచ్ఎం పై దాడి ఘటనపై కమీషన్ విచారణ

* ప్రోటోకాల్ పాటించని అధికారులపై రాష్ట్ర గవర్నర్ కి ఫిర్యాదు

 రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు

        హెచ్ఎం రాజాం నాయుడు తో మాట్లాడుతున్న కమిషన్ చైర్మన్ డాక్టర్ రవి బాబు 

విశాఖపట్నం (ఆనంద్):

విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం లోతుగెడ్డ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల పై జరిగిన దాడి విచారణకు హాజరైన రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు ప్రశ్నలకు అధికారులు నీళ్ళు నమిలారు. సోమవారం లోతుగెడ్డ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ ఉన్నత పాఠశాలను రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కుంభా రవిబాబు సందర్శించారు. తొలుత ప్రధానోపాధ్యాయులు రాజం నాయుడు, స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యక్ష సాక్షులు, పోలీసు, రెవెన్యూ అధికారులను ఎస్టీ కమిషన్ చైర్మన్ వేర్వేరుగా విచారించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ విచారణలో ఆయన పోలీసు అధికారులకు ప్రశ్నలను సంధించారు. ఈనెల 24వ తేదీన ప్రధానోపాధ్యాయులు రాజం నాయుడుపై ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు పాఠశాల ఆవరణలో కి వచ్చి దాడి చేశారని, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకూ పాఠశాల ఆవరణలో ఉంటూ దాడి చేసిన వ్యక్తులు హల్చల్ చేశారన్నారు. ప్రధానోపాధ్యాయులు పై రక్తం వచ్చినట్టుగా దాడి చేశారన్నారు. 

  ఉద్యోగ సంఘాల నాయకుల తో మాట్లాడుతున్న చైర్మన్ రవిబాబు 

ఈ ఘటనపై ప్రధానోపాధ్యాయులు అన్నవరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినప్పటికీ నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు తీవ్ర జాప్యం చేశారన్నారు. ఓవైపు నిందితులు బహిర్గతంగా తిరుగుతూ, వారి అనుచరులను ప్రధానోపాధ్యాయులు వద్దకు పంపించి కేసు రాజీ చేసుకోవాలని ఒత్తిడి తీసుకు వచ్చారని, సకాలంలో నిందితులను అరెస్టు చేయకపోవడం వల్ల దారుణంగా దాడి చేసి కేసుని రద్దు చేసుకోవాలని  నిందితులు ప్రయత్నించారన్నారు. సంఘటన 24వ తేదీన జరిగితే, 29వ తేదీన ఎస్టీ కమిషన్ లోతుగెడ్డ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శింస్తుందని తెలుసుకొని, చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు హడావుడిగా పోలీసులు 28వ తేదీన నిందితులు ఇద్దరిని అరెస్టు చేశారన్నారు. ఎఫ్ఐఆర్ లో 356 నాన్ బెయిల్ బుల్ సెక్షన్ నమోదు చేసిన పోలీసులు 24 గంటల్లో నిందితులను అరెస్టు చేయాల్సి ఉన్నప్పటికీ ఎందుకు అరెస్టు చేయలేదని పోలీసులను ప్రశ్నించారు. దీనికి పోలీసులు మౌనం వహించారు.

పోలీసులను ప్రశ్నిస్తున్న కమిషన్ చైర్మన్ డాక్టర్ రవి బాబు 

 ప్రధానోపాధ్యాయులు పై రక్తం వచ్చినట్టు దాడి చేసిన 326 సెక్షన్ ఎందుకు నమోదు చేయలేదని ఆయన మరోసారి పోలీసులను ప్రశ్నించారు. విచారణ లో అవసరమైన సెక్షన్లను జోడిస్తామని పోలీసులు సమాధానం ఇచ్చినప్పటికీ దాన్ని కమిషన్ చైర్మన్ తోసిపుచ్చారు. నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేసి 24 గంటల్లో నిందితులను అరెస్టు చేయాల్సినప్పటికి  అయిదు రోజులు జాప్యం చేసి, కమీషన్ పాఠశాలకు వచ్చి విచారణ చేస్తుందని భావించి హడావుడిగా 28వ తేదీన అరెస్టు చేశారని ఆయన అన్నారు. అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ సతీష్ పై ఎందుకు కేసు నమోదు చేయలేదని మరోసారి తీవ్రస్థాయిలో పోలీసులను కమిషన్ చైర్మన్ ప్రశ్నించారు. పాఠశాలకు చెందిన ల్యాప్ టాప్ తీసుకుని వెళ్లిన జిల్లా కోఆర్డినేటర్, నేరుగా తిరిగి పాఠశాలకు తీసుకొని వచ్చి అప్పగించాల్సింది పోయి ప్రైవేటు వ్యక్తులతో పంపించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో వెల్లడించాలని పోలీసులను ఆయన సూచించారు. ప్రధానోపాధ్యాయులు రాజం నాయుడు పై జరిగిన దాడిని ఎస్టీ కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుందన్నారు, పోలీసులు లోతుగా విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

  మీడియా తో మాట్టాడుతున్న ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కుంభ రవిబాబు 

ప్రోటోకాల్ పాటించని అధికారులపై రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు..

ప్రధానోపాధ్యాయుల పై ప్రైవేటు వ్యక్తులు జరిపిన దాడి ఘటనపై విచారణ చేపట్టేందుకు రాష్ట్ర ఎస్టీ కమిషన్ లోతుగెడ్డ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలను సందర్శిస్తుందని రెండు రోజుల కిందట జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి కమిషన్ లేఖలు పంపినప్పటికీ, జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి అధికారులు(పీవో, సబ్ కలెక్టర్, ఏఎస్పీ)  గైర్హాజరై ప్రోటోకాల్ పాటించపోవడం పై రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి , ముఖ్య కార్యదర్శి కి ఫిర్యాదు చేస్తానని కమిషన్ చైర్మన్ డాక్టర్ కుంభా రవిబాబు స్పష్టం చేశారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రత్యేక ఎస్టీ కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాజ్యాంగ పరమైన కమీషన్ కి విస్తృత అధికారాలు ఉంటాయన్నారు. ఆదివాసీల సమస్యలు పరిష్కరించే రాజ్యాంగపరమైన కమిషన్ ని అధికారులు ఏ విధంగా పరిగణిస్తున్నారో తెలియదు గాని, ఇది రాజ్యాంగపరమైన కమిషన్ అని, ఎక్కడైతే ఆదివాసీ హక్కులు హరించబడతాయో అక్కడ గిరిజన కమిషన్ ముందు ఉంటుందని ఆయన అన్నారు. ఇది కుంభ  రవి బాబు కమిషన్ కాదని, ఆదివాసి హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటైన రాజ్యాంగపరమైన కమిషన్ అని ఆయన ఉద్ఘాటించారు.

   సన్మానిస్తున్న గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సంఘం నాయకులు 

గిరిజనుల స్వేచ్ఛాయుత జీవనానికి ఎస్టీ కమిషన్ అండగా ఉంటుంది: చైర్మన్ డాక్టర్ కుంభ రవిబాబు

గిరిజనుల స్వేచ్ఛాయుత జీవనానికి రాష్ట్ర ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని చైర్మన్ డాక్టర్ కుంభ రవిబాబు అన్నారు. సోమవారం స్థానిక లోతుగెడ్డ గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలను సందర్శించిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ గిరిజన ఉద్యోగులు,వివిధ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ గిరిజనుల హక్కులు, చట్టాలను సమర్థవంతంగా అమలుచేస్తూ ఆదివాసీలకు ఉత్తమ సేవలందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రంలోనున్న 32 లక్షల ఆదివాసీల్లో ఎవరికి కష్టం వచ్చిన ఎస్టీ కమిషన్ స్పందిస్తుందన్నారు. రాజ్యంగబద్ధంగా గిరిజనులకు కల్పించిన హక్కులు సంపూర్ణంగా అందాలన్నారు. గిరిజన చట్టాలు పక్కాగా అమలుకావాలన్నారు. షెడ్యుల్ ప్రాంతాల్లో పనిచేస్తున్న అధికారులు బాధ్యతాయుతంగా చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. 


ప్రజలకు అభివందనం చేస్తున్న  ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కుంభ రవిబాబు

గిరిజన చట్టాలు, హక్కులను ఎవరు ఉపేక్షించినా చర్యలు తప్పవన్నారు. ప్రధానంగా భూబదలాయింపు, పేసా, అటవీ హక్కుల చట్టం సమర్థవంతంగా అమలుచేయాలన్నారు. ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసులో నిందితులను ముందుగా అరెస్టుచేసి డీఎస్పీ స్థాయి అధికారి విచారణను వేగవంతం చేయాలన్నారు. అనంతరం గిరిజన సంక్షేమశాఖ ఉపాధ్యాయ సంఘాల నాయకులు కమిషన్ చైర్మన్ ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ సతక బుల్లిబాబు, లోతుగెడ్డ సర్పంచ్ చింతర్ల సునీల్, వైసీసీ రాష్ట్ర కార్యదర్శి మత్స్యరాస విశ్వేశ్వరరాజు, పాడేరు జెడ్పీటీసీ సభ్యురాలు గాయత్రి, మాజీ ఎంపీపీ మత్స్యరాస వెంకట గంగరాజు, ప్రధానోపాధ్యాయులు, వివిధ సంఘాల నాయకులు ప్రభుదాస్, యూవీగిరి, కేవీరమణ, చింతర్ల సాగర్, ఆదివాసి జేఏసి, డిఎల్ వో నాయకులు సుబ్రహ్మణ్యం, మాణిక్యాలరావు పాలసీ కృష్ణారావు చిట్టపులి శ్రీనివాసరావు పాల్గొన్నారు 

Post a Comment

0 Comments