పాడేరు(వి.డేవిడ్): పాడేరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో బుధవారం జరిగే ఆదివాసి నిరసన ర్యాలీకి మన్యం ప్రజలు భారీగా తరలి రావాలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పాచిపెంట శాంతకుమారి పిలుపునిచ్చారు. మంగళవారం ఆమె విలేఖరులతో మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఆన్లైన్ దరఖాస్తు వెబ్సైట్లలో గిరిజన ఉప తెగలు వాల్మీకి, భగత, గౌడ కులాలు తొలగింపుపై ఆదివాసీలు నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నారన్నారు. గిరిజన ఉప తెగల తొలగింపుపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉప తెగలను తొలగించిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. సెప్టెంబర్ 24, అక్టోబర్ 22న ఆదివాసీలు ఆందోళన చేపట్టినప్పటికీ ప్రభుత్వం లో ఎటువంటి స్పందన కనిపించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు గిరిజన ప్రజలు ఐక్యతగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బుధవారం జరిగే నిరసన ర్యాలీ కి గిరిజన మేధావులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు.
అధికార పార్టీ నాయకుల వైఖరి ప్రకటించాలి:
ప్రభుత్వ సంక్షేమ పథకాల ఆన్లైన్ దరఖాస్తు ఆప్షన్ నుంచి గిరిజన తెగల తొలగింపుపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తమ వైఖరి ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంతకుమారి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెప్పుకోసం ఉత్సాహంగా జనాగ్రహ దీక్షలో పాల్గొన్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ నిరసన ర్యాలీ లో పాల్గొనాలని ఆమె డిమాండ్ చేశారు. గిరిజన ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీలు నిరసన ర్యాలీ లో పాల్గొని తమ మద్దతు తెలియజేయాలన్నారు. అధికార పార్టీ నాయకులు ఆదివాసీలకు అండగా నిలవాలని, అయితే ఆదివాసీల అభిప్రాయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ప్రజలు సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని ఆమె అన్నారు.
0 Comments