ఏజెన్సీలో తొలి గిరిజన చార్టెర్డ్ అకౌంటెంట్ ఈశ్వరరావుకి స్వగ్రమంలో ఘనసన్మానం

గ్రేడ్ -1 చార్టెర్డ్ అకౌంటెంట్ గా ఉద్యోగం సాధించిన గిరిజన యువకుడు ఈశ్వరరావుని సన్మానిస్తున్న ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు

కొయ్యూరు(ఆనంద్):
విశాఖ ఏజెన్సీలో తొలి గిరిజన చార్టెర్డ్ అకౌంటెంట్ ఈశ్వరరావుని స్వగ్రామం గాంకొండలో ఉద్యోగులు, స్థానికులు గురువారం ఘనంగా సన్మానించారు. వివరాల్లోకి వెళితే, కొయ్యూరు మండలం శరభన్నపాలెం గాంకొండ గ్రామానికి చెందిన నిరుపేద గిరిజన రైతు ముర్ల దేముడు, కాంతమ్మ దంపతుల కుమారు ముర్ల ఈశ్వరరావు ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించాలని పట్టుదలతో విద్యాభ్యాసం చేశాడు. ఒకటి నుంచి ఐదోతరగతి వరకు స్థానిక శరభన్నపాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోను, పదోతరగతి వరకు విశాఖపట్నం మారికవలస గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం చేశాడు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఇంటర్మీడియేట్ ఎంఈసీ గ్రూప్ లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాడు. వెంటనే చార్టెర్డ్ అకౌంటెంట్ కావాలనే లక్ష్యంతో చెన్నై సూపర్ విజ్ లో సీఏ పౌండేషన్ కోర్సులో చేరి 2021 లో కోర్సును సమర్థవంతంగా పూర్తి చేసుకున్నాడు. తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో గ్రేడ్ -1 చార్టెర్డ్ అకౌంటెంట్ పోస్టునకు చివరి ఇంటర్వ్యూకి దేశ వ్యాప్త గా పది మంది హాజరుకాగా ఈశ్వరరావు ఉద్యోగాన్ని సాధించాడు. ఈనెల 9 న భువనేశ్వర్ ఇండియన్ ఆయిల్ కంపెనీలో గ్రేడ్ -1 చార్టెర్డ్ అకౌంటెంట్ గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శరభన్నపాలెం పరిసర గ్రామాల గిరిజనులు ఈశ్వరరావు నివాసం వద్దకు వచ్చి సన్మానించి అభినందిస్తున్నారు. గురువారం లంబసింగి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పనసల ప్రసాద్, చింతపల్లి ఆశ్రమ పాఠశాల స్కూల్ అసిస్టెంట్ ముర్ల సావిత్రి, ఉపాధ్యాయులు గోవింద్, అన్నపూర్ణ, శరభన్నపాలెం గ్రామ పెద్దలు బేరా నారాయణరావు, ముర్ల గంగరాజులు చార్టెర్డ్ అకౌంటెంట్ గా ఎంపికైన ఈశ్వరరావుని ఘనంగా సన్మానించి, గిరిజన విద్యార్థులు ఈశ్వరరావుని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

Post a Comment

0 Comments