విశాఖ ఏజెన్సీలో వాతావరణం మార్పుల వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం..వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఆదివాసుల యోగక్షేమాలు తెలుసుకోవాలి: పాడేరు అదనపు డీఎం హెచ్ ఓ సురేఖ

వైద్య సిబ్బంది తో మాట్లాడుతున్న ఏడిఎం హెచ్ ఓ సురేఖ
పాడేరు(వి.డేవిడ్):
విశాఖ ఏజెన్సీలో కలిగిన వాతావరణ మార్పుల వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వైద్య సిబ్బంది గ్రామాల్లో ఇంటింటి సందర్శనలు నిర్వహించి ఆదివాసుల యోగక్షేమాలు తెలుసుకోవాలని పాడేరు అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి టి. సురేఖ అన్నారు. గురువారం ఆమె మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న నాడు-నేడు పనులను ఆమె స్వయంగా పరిశీలించారు. పనులు జరుగుతుండడం వల్ల వైద్య సేవలకు కొంత అంతరాయం కలుగుతుందని, పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని ఆమె అన్నారు. ఏజెన్సీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో గ్రామాల్లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. వైద్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాల పరిధిలోని గ్రామాలను సందర్శించి రోగులకు పారామెడికల్ సిబ్బంది సకాలంలో వైద్య సేవలు అందించాలన్నారు. ప్రసవ సమయం  దగ్గర పడిన గర్భిణులను  ముందుగా గుర్తించి సమీపంలోనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఏరియా ఆస్పత్రులకు   తరలించి, ఆస్పత్రిలోనే ప్రసవం పొందేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. విధుల పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.  ఈ కార్యాలయంలో వైద్యాధికారి డా. ప్రవీణ్ కుమార్ గారు, ఆరోగ్య విస్తారణాధికారి గుల్లేలి సింహాద్రి, పి.హెచ్.సి సిబ్బంది పాల్గున్నారు. 

Post a Comment

0 Comments