ఆ.. ఆదివాసీ బాలింతకు ఎంత కష్టం.. డోలి పై వాగు దాటించి ఆస్పత్రికి తరలింపు

 


 

బాలింత విజయలక్ష్మిని డొలిపై అతికష్టంపై బూరుగుబయలు వాగు దాటిస్తున్న కుటుంబ సభ్యులు
చింతపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలింత, శిశువు

చింతపల్లి(విఎస్ జే  ఆనంద్ ):
విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం, బలపం పంచాయతీ బూరుగుబయలు గ్రామానికి చెందిన ఓ పచ్చిబాలింతకు వైద్యం అందించేందుకు ఆదివాసీలు నరకయాతన అనుభవించాల్సి వచ్చింది. గురువారం బలపం పంచాయతీ బూరుగుబయలు గ్రామం ఓ బాలింతకు చికిత్స అందించేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొవాల్సివచ్చింది. బూరుగుబయలు గ్రామానికి చెందిన వూలంగి విజయలక్ష్మి (28) కి బుధవారం రాత్రి నెలలు నిండి పురిటినొప్పులు వచ్చాయి. అర్థరాత్రి దాటిన తరువాత ఆమె గృహంలోనే ప్రసవం పొందింది . ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది. బాలింత తీవ్ర నిరసరంతో నడవలేని స్థితిలో అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబ సభ్యులు బాలింత, శిశువుని ఉదయం కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించేందుకు డోలిలో మోసుకొచ్చారు. బూరుగుబయలు వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో గ్రామానికి అంబులెన్సు వచ్చే పరిస్థితిలేదు. దీంతో కుటుంబ సభ్యులు నడుములోతులో ప్రవహిస్తున్న బూరుగుబయలు వాగు వద్ద అతి కష్టం పై బాలింతను డోలిలో దాటించి కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. స్థానిక వైద్యాధికారి సురేష్ కుమార్ ప్రాథమిక పరీక్షలు నిర్వహించి, అంబులెన్సులో చింతపల్లి ఆస్పత్రికి తరలించారు. తల్లి, బిడ్డ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు బాలింత., శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా తమ గ్రామానికి రహదారి సదుపాయం లేదని, వాగు వద్ద బ్రిడ్జి నిర్మించకపోవడం వల్ల రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని బాలింత విజయ లక్ష్మి అవేధన వ్యక్తంచేసింది.

Post a Comment

0 Comments