విశాఖపట్నం: లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం మే నెల వేతనాల్లో కోత విధించే చర్యలు తీసుకుంటుంది. గత నెల మాదిరిగానే ఈ నెల కూడా ఉద్యోగులు, ప్రభుత్వ పింఛనుదారులకు చెల్లించే వేతనాలు, పింఛన్లలో కోత అమలు చేయనుంది. కోతతో కూడిన బిల్లులను ఈనెల 23వ తేదీ నుంచి సీఎఫ్‌ఎంఎస్ విధానంలో పెట్టాలని డీడీఓలకు జిల్లా ఖజానా శాఖ ఉప సంచాలకులు టి.రామ్‌ప్రసాద్ సూచించారు. ఈ మేరకు ఖజానా శాఖ రాష్ట్ర సంచాలకులు మార్గదర్శకాలు జారీ చేశారన్నారు.
జిల్లా వ్యాప్తంగా 55 వేల మంది ఉద్యోగులు: జిల్లా వ్యాప్తంగా 55 వేల మంది ఉద్యోగులు, 25 వేల మంది పింఛనుదారులు ఉన్నారు. ఐఏఎస్ అధికారులకు 60 శాతం, గెజిటెడ్, ఎన్జీఓలకు 50 శాతం, నాలుగో తరగతి ఉద్యోగులకు పది శాతం చొప్పున వేతనాల్లో కోత పడనుంది. పింఛనుదారుల్లో నాలుగో తరగతి ఉద్యోగులకు మాత్రమే పూర్తి పింఛను అందనుంది. మిగతా ఫించనుదారులకు 50శాతం కోత పడనుంది. వరుసగా రెండో నెల కూడా జీతాల్లో కోత పడనుండడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఆరోగ్యశాఖ సిబ్బంది,మున్సిపాల్టీ ఉద్యోగులు,, పోలీసులు, హోంగార్డులు ఉద్యోగులకు పూర్తి వేతనం అందనుంది.
0 Comments