చింతపల్లి: కన్న తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య లేదు. నివసించేందుకు గూడు కూడా లేదు..ఆయన కింద అనే వారే లేరు.. కటిక పేదరికం లో ఆకలితో అల్లాడుతున్న అప్పారావు ఆదుకునే హస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. వివరాల్లోకి వెళితే చింతపల్లి మండల కేంద్రానికి కూతవేటు దూరం పెద్దపొలం గ్రామంలో అప్పారావు నివసిస్తున్నాడు. అప్పారావు తల్లిదండ్రులు, భార్య మరణించడంతో ఒంటరి జీవితాన్ని సాగిస్తున్నాడు. కుటుంబ సభ్యుల మరణంతో కృంగిపోయిన ఆయన మద్యానికి బానిస అయ్యాడు. ఆరోగ్యం క్షీణించి అనాదగా జీవనం సాగిస్తున్న అప్పారావు కొంతకాలం కిందట నుంచి మద్యం అలవాటు మానుకున్నప్పటికీ ఎవరూ లేరన్న (ఏకాకి) మనోవేదన ఆయన్ని కుంగదీస్తుంది. ప్రస్తుతం చిన్న పాకలో ఆయన జీవనం సాగిస్తున్నాడు. గిరిజన సహకార సంస్థ ద్వారా నెలకు లభించే ఐదు కిలోల బియ్యమే ఆయనకు ఆధారం .ప్రస్తుతం ఆయన ఉంటున్న చిన్నపాటి పాక కూలేందుకు సిద్ధంగా ఉంది. వర్షం కురిస్తే పూర్తిగా కారిపోతుంది. దీంతో ఆయన తలదాచుకోడానికి కష్టంగా మారింది. తన సమస్యను చెప్పుకోవాలో తెలియక తనతో కలసి చదువుకున్న స్నేహితుడు, చింతపల్లి విశాలాంధ్ర పాత్రికేయుడు కాశిమ్ వలీతో ఆవేదన వ్యక్తం చేసుకున్నాడు. దీంతో కాశిం వల్లి తన తోటి పాత్రికేయుడు షేక్ గౌస్ తో కలసి పదికిలోల బియ్యం, కూరగాయలు అందించారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ తన పరిస్థితిని అర్థం చేసుకుని దాతలు ఎవరైనా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశాడు. సహాయం చేసే వ్యక్తులు 94922 46293నంబర్ కి కాల్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
0 Comments