కన్నీరు పెట్టుకున్న రష్మి

హైదరాబాద్‌ మార్చి 31 : కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ విధించడం వల్ల మూగజీవాల పరిస్థితి వేదన కలిగిస్తోందని ప్రముఖ వ్యాఖ్యాత, నటి రష్మి గౌతమ్‌ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవుతున్నప్పటికీ ఆహారం దొరక్క వందల మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె లైవ్‌లో మాట్లాడుతూ కన్నీరుమున్నీరయ్యారు. రోజు వారి కూలీలు, పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, చాలా మంది సమయానికి తిండి కూడా తినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీధుల్లో కుక్కలు, ఆవులు కూడా ఆహారం దొరక్క ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయన్నారు. మానవతా దృక్పథంతో ప్రజలంతా వీధి శునకాలు, పిల్లులు ఇతర జీవాల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజారోగ్యానికి ఆర్థిక సాయం చేసినట్లుగానే.. మూగజీవాల కోసం పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు తోచినంత సాయం చేయాలని కోరారు. ఒక్క రూపాయి ఇచ్చినా.. అది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఇంటి పరిసరాల్లో ఉండే పేదలకు కూడా సహాయం అందించాలని పిలుపునిచ్చారు. అంతేకాదు రష్మి తన ప్రాంతానికి దగ్గర ఉన్న కొన్ని శునకాలకు స్వయంగా ఆహారం పెట్టారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను, వీడియోను షేర్‌ చేశారు. సోమవారం రష్మి పీఎం-కేర్స్‌ ఫండ్‌కు రూ.25 వేలు విరాళంగా ఇచ్చారు. అదేవిధంగా ఆకలితో ప్రాణాలు కోల్పోతున్న మూగజీవాల కోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇచ్చినట్లు ట్వీట్‌ చేశారు.

Post a Comment

0 Comments