న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. 24 గంటల వ్యవధిలో దాదాపు అన్ని దేశాల్లోనూ కరోనా వైరస్ మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. చైనా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, అమెరికా, ఇరాన్ వంటి దేశాల్లో మరణాల సంఖ్య భయాందోళనలను కలిగిస్తోంది. భారత్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. మనదేశంలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇక దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో ప్రజలకు నిత్యావసర వస్తువులకు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు ప్రస్తుతం దుకాణాల్లో ఉన్న స్టాక్ కూడా అయిపోవస్తున్నందున ఇక రానున్న రోజుల్లో నిత్యావసర వస్తువులు లభించకుండా పోయే ఆస్కారం ఉంది. ఈ క్రమంలోనే నిత్యావసరాల వస్తువుల రవాణా, వస్తువుల డెలివరీలపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖకింద పనిచేసే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ చర్యలు తీసుకుంది. ఇందుకోసం రియల్‌టైమ్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది.25 మార్చి నుంచి ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం ప్రతి ఒక్క విషయాన్ని దగ్గరుండి సమీక్షిస్తోంది. సామాన్యుడికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది. ఒకవేళ నిత్యావసర సరుకులు రవాణా చేస్తున్న వారు ఎక్కడైనా ఎవరినుంచైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే ఫోన్ చేయాలని చెబుతూ ఒక ఫోన్ నెంబరును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ ఫోన్ నెంబర్ + 91 11 23062487. ఇక ఈమెయిల్ కూడా ఇచ్చింది. ఈమెయిల్ controlroom-dpiit@gov.in టెలిఫోన్ నెంబర్ ప్రతిరోజు ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు అందుబాటులో ఉంటుందని వాణిజ్య శాఖ వెల్లడించింది. ఇక సరుకు రవాణా చేసేవారు, డిస్ట్రిబ్యూటర్లు, ఈ-కామర్స్ సంస్థలు ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వారు పైన ఇచ్చిన ఫోన్ నెంబరుకు ఫోన్ చేయాలని సూచించింది. ఫోన్ కాల్ అందుకున్న వెంటనే కేంద్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో లేదా జిల్లా అధికారులు, పోలీస్ యంత్రాంగంతో సంప్రదింపులు చేపడుతుందని వాణిజ్య శాఖ వెల్లడించింది.
0 Comments