హైదరాబాద్: తెలంగాణలో భయానక కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్యలో రోజురోజుకూ పెరుగుదల కనిపిస్తూనే వస్తోంది. ఇప్పటికే తెలంగాణలో 70కి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ వైరస్ వల్ల ఇప్పటిదాకా ఒక్కరే మరణించారు. హైదరాబాద్ పాతబస్తీలో నివసించే 74 సంవత్సరాల వయోవృద్ధుడొకరు కరోనాకు బలి అయ్యారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోని ఐసొలేషన్ కేంద్రంలో చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు.
ఆ వృద్ధుడి మృతదేహానికి ఈ ఉదయం అంత్యక్రియలను నిర్వహించారు. కుటుంబ సభ్యులు గానీ, బంధుమిత్రులు గానీ ఎవ్వరూ రాలేదు. రానివ్వలేదు కూడా. ఆ వృద్ధుడి కుటుంబ సభ్యులు, బంధువుల్లో చాలామంది ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంటున్నారు. వారికి కూడా కరోనా వైరస్ సోకి ఉండొచ్చని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. దీనితో అంత్యక్రియల కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న సమాచారం మాత్రమే ఇచ్చారు. ఎవ్వరూ రాకూడదని ఆదేశించారు.
అంత్యక్రియలను వైద్య శాఖ సిబ్బందే నిర్వహించారు. అతని మృతదేహాన్ని అంబులెన్స్‌లో శ్మశానానికి తరలించారు. అప్పటికే అక్కడ తీసి ఉంచిన గొయ్యిలో పాతిపెట్టారు. మృతదేహాన్ని కిందికి దించడానికి ముందు- ఆ ప్రాంతాన్ని పూర్తిగా శానిటైజ్ చేశారు. మృతదేహాన్ని గొయ్యిలో ఉంచిన తరువాత కూడా శానిటైజ్ చేశారు. మట్టితో కప్పేశారు. వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం ఉన్నందున.. పూడ్చిపెట్టిన స్థలాన్ని శానిటైజ్ చేశామని సిబ్బంది వివరించారు.సాధారణంగా అంత్యక్రియల సమయంలో కనిపించే సంప్రదాయాన్ని వైద్య సిబ్బంది పక్కన పెట్టారు. లాక్‌డౌన్ కొనసాగుతుండటం, ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి ఆ వృద్ధుడు మరణించడం, కుటుంబ సభ్యులు కూడా క్వారంటైన్‌లో ఉండటం వంటి పరిస్థితుల మధ్య సంప్రదాయానికి భిన్నంగా అంత్యక్రియలను నిర్వహించారు. చుట్టుపక్కల కూాడా ఎవ్వరూ ఉండకుండా జాగ్రత్తలు తీసున్నారు. కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి మృతదేహాలకు అంత్యక్రియలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని నిబంధనలను జారీ చేసింది. దానికి అనుగుణంగా తాము అంత్యక్రియలను చేపట్టినట్లు తెలిపారు వైద్య సిబ్బంది.
0 Comments