లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా అకారణంగా బయట తిరిగితే జైలు శిక్షలు సైతం పడే అవకాశం ఉందని నగర పోలీసు కమిషనర్ ఆర్.కె.మీనా హెచ్చరించారు. ఆయన ఓ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్పారు.లాక్‌డౌన్ నిబంధనల అమలుకు హోంగార్డులతో సహా సుమారు 4,400 మంది పోలీసులు పనిచేస్తున్నారు. జనం ఉదయం పదకొండు గంటలలోపు నిత్యావసరాల్ని కొనుగోలు చేసుకుని వారిళ్లకు వెళ్లిపోవాలి. దుకాణాల యజమానులు, సిబ్బంది 12 గంటలకల్లా ఇంటికి చేరాలి. ఆయా దుకాణదారులు కూడా వారి గుర్తింపుకార్డును తమతో ఉంచుకోవాలి.
•సమయంతో నిమిత్తం లేకుండా వ్యాపార దుకాణాలు తెరవడం, అకారణంగా రోడ్డుమీద తిరగడం తదితర కారణాలతో 381 కేసులు నమోదు చేసి, 726 మందిని అరెస్ట్ చేశాం. 565 వాహనాలను స్వాధీనం చేసుకున్నాం. ఎం.వి.యాక్ట్ కింద మరో 21,891 మంది నుంచి రూ.53 లక్షల అపరాధ రుసుములు వసూలు చేశాం.
•కొందరు పోలీసులకు పట్టుపడినప్పటికీ మళ్లీ మళ్లీ రహదారులపైకి వస్తున్నారు. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తాం.
నగరంలో ఇప్పటివరకు 51 దుకాణ యజమానులతో మాట్లాడి సరకులను నేరుగా ఇంటికే పంపే ఏర్పాట్లు చేశాం. రైతుబజార్లలో నిర్ణీత దూరం పాటించని వారిపై రానున్న రోజుల్లో కేసులు నమోదు చేస్తాం.
•వ్యాపార దుకాణాల వారు నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే చట్టప్రకారం వారిపై కూడా కేసులు పెడతాం. లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు మళ్లీ దుకాణాలను తెరవనివ్వం. సరకులను ఇంటికి ఉచితంగానే సరఫరా చేయాలి. •నిత్యావసరాలను విక్రయించుకోవడానికి అంగీకరించిన ప్రతి దుకాణదారుడూ కనీసం వెయ్యి మందికి సరుకులు ఇంటికి పంపాలి.
విదేశాల నుంచి నగరానికి వచ్చి స్వీయ నిర్బంధాల్లో(హోం క్వారంటైన్లు) సుమారు 2507 మంది ఉన్నారు. వారు కచ్చితంగా ఇళ్లకే పరిమితం కావాలి. హోం క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన 20 మందిపై కేసులు నమోదు చేశాం.
•కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు విధి నిర్వహణలో ఉండే సిబ్బంది కూడా కరోనా బారిన పడే ముప్పు పొంచి ఉంది. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తించే ఏర్పాట్లు చేశాం.
•సరకుల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని కొందరు ఫిర్యాదు చేస్తున్నారు. రవాణా వాహనాలు వేటినీ ఆపకూడదని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. సరకు రవాణా పేరుతో మనుషుల్ని రవాణా చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం చర్యలు తప్పవు.
•కొందరు ఉదయపు వేళ నడక పేరుతో, కొందరు సాయంత్రం నడక పేరుతో పలు రహదారులపై తిరుగుతున్నారు. వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని గుర్తుంచుకోవాలి. నిత్యావసరాలు, వైద్య అవసరాలు మినహా ఏ ఇతర కారణాలతోనూ బయటకు రాకూడదు.
•నగరంలో చిక్కుకుపోయిన ఇతర ప్రాంతాల వారికి వివిధ చోట్ల వసతి కల్పిస్తున్నాం. వారికి అవసరమైన ఆహార సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. పలువురు దాతలు వారికి అవసరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. ఆర్.ఐ. రమేశ్ 94407 96054 నెంబరుకు ఫోన్ చేస్తే ఆహారం అవసరముంటే తీసుకుంటారు.
•అత్యవసరంగా బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడితే పోలీసు కంట్రోల్ రూం నెంబరు 0891-2565454కు డయల్ చేసి సమాచారం ఇస్తే ఉన్నతాధికారులు తగిన సలహాలు, సూచనలు ఇస్తారు.
•విశాఖలోని పోలీసుశాఖలో సుమారు 500 మంది 55ఏళ్ల వయస్సు దాటినవారున్నారు. డీజీపీ ఉత్తర్వుల మేరకు వారికి నియంత్రణ గదుల్లో విధులు నిర్వర్తించేలా చర్యలు చేపట్టాం.
0 Comments