అల్లూరి జిల్లాలో ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

అల్లూరి జిల్లాలో ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

పాడేరు, ఫిబ్రవరి 07( సురేష్ కుమార్ పాడేరు స్టాఫ్ రిపోర్టర్): అల్లూరి సీతారామరాజు జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శుభవార్త అందించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పోలవరం ముంపు మండలాల పరిధిలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఒక ప్రకటన విడుదల చేస్తూ, అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను నేరుగా సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) మెడికల్ ఆఫీసర్‌కు అందజేయాలని సూచించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 7వ తేదీ నుండి ఫిబ్రవరి 20వ తేదీ వరకు గడువు నిర్ణయించారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఫిబ్రవరి 23న జిల్లా అధికారిక వెబ్‌సైట్ https://allurisitharamaraju.ap.gov.in లో ప్రొవిజనల్ జాబితాను అందుబాటులో ఉంచనున్నారు. ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే, అభ్యర్థులు ఫిబ్రవరి 24 నుండి 26వ తేదీ లోపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు.
అయితే, ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన ఎటువంటి ఫిర్యాదులనైనా కేవలం వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోనే స్వీకరిస్తారని, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ కార్యాలయంలో గానీ, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గానీ ఎటువంటి దరఖాస్తులు లేదా ఫిర్యాదులు స్వీకరించబడవని అధికారులు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు జిల్లా వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.

Post a Comment

0 Comments