డ్రోన్‌ సాయంతో పది వేల సీడ్‌ బాల్స్‌ చల్లిన అటవీశాఖ

అడవుల పచ్చదనానికి 'డ్రోన్' సాంకేతికత
చింతపల్లి రేంజ్ పరిధిలో పదివేల సీడ్ బాల్స్ వెదజల్లిన అటవీ శాఖ

అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 3 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్):
అడవుల విస్తరణ, పచ్చదనం పెంపొందించే దిశగా అటవీశాఖ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ డ్రోన్‌ సాయంతో దట్టమైన అటవీ ప్రాంతంలో విత్తన బంతులను (సీడ్‌ బాల్స్‌) వెదజల్లారు. చింతపల్లి అటవీ రేంజ్‌ పరిధిలోని కొండ సంత సెక్షన్‌ (కొండ సంత బీటు), డౌనూరు సెక్షన్‌ పరిధి రావిమాను పాకల లిమిట్స్‌లో సోమవారం ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. అటవీ పరిధి అధికారి (ట్రైనీ) ఎం. మని కృష్ణ, కొండ సంత ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి ఎం. సింహాచలం పర్యవేక్షణలో ఈ డ్రోన్‌ సీడింగ్‌ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. స్థానిక వాతావరణానికి అనుగుణంగా సులువుగా మొలకెత్తే వెదురు, కానుగ, చింత జాతులకు చెందిన పది వేల విత్తన బంతులను ఈ రెండు సెక్షన్ల పరిధిలో ఆకాశం నుంచి వెదజల్లినట్లు అధికారులు తెలిపారు. మనుషులు సులభంగా చేరుకోలేని దట్టమైన కొండ ప్రాంతాల్లో సైతం డ్రోన్ల ద్వారా విత్తనాలు చల్లడం వల్ల భవిష్యత్తులో అటవీ సంపద గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. సాంకేతికతను జోడించి పర్యావరణ పరిరక్షణకు అటవీశాఖ తీసుకుంటున్న ఈ చర్యల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్‌ బీట్‌ అధికారులు ఎల్‌. శ్వేత, శ్రీఆంజనేయ, ప్రియాంజలిలతో పాటు స్థానిక గ్రామస్తులు,అటవీ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments