కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ను చింతపల్లి లోనే ఏర్పాటు చేయాలి -వైకాపా నాయకులు చింతపల్లి జడ్పిటిసి బాలయ్య, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి సుధాకర్, లక్ష్మణ్ ల డిమాండ్

చింతపల్లిలోనే కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలి 
వైకాపా నేతల డిమాండ్

అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 11(సురేష్ కుమార్, అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్): చింతపల్లి, గూడెం కొత్తవీధి, కొయ్యూరు, మరియు జి. మాడుగుల మండలాల్లో  కాఫీ అధికంగా పండిస్తున్నారని, కాబట్టి చింతపల్లి పరిసర ప్రాంతాలలోనే కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చింతపల్లి జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి జల్లి సుధాకర్, బొబ్బిలి లక్ష్మణ్ లు డిమాండ్ చేశారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ, చింతపల్లితో పాటు మన్యం ప్రాంతాలలో కాఫీ యూనిట్ ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు, ప్రభుత్వ స్థలాలు ఉన్నప్పటికీ, మైదాన ప్రాంతమైన మాకవరపాలెం మండలం శెట్టిపల్లిలో దీనిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. దీని వెనుక శాసనసభ సభాపతి అయ్యన్నపాత్రుడు కుయుక్తులు ఉన్నాయని, గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దక్కకుండా ఈ కుట్ర పన్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే జి.ఓ. నెం. 3 రద్దుతో ఉపాధి కోల్పోయి గిరిజన యువత ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలో ఈ చిన్నపాటి అవకాశం కూడా మైదాన ప్రాంతానికి తరలించడం కూటమి ప్రభుత్వానికి తగదని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివాసి దినోత్సవం నాడు వర్చువల్‌గా యూనిట్‌ను ప్రారంభించినట్లు వార్తలు వచ్చాయని తెలిపారు. ఈ ప్రాంతంలోని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ, జీసీసీ ఎండీ, ఇతర ఉన్నతాధికారులు కాఫీ ఎక్కువగా పండే చింతపల్లిలో యూనిట్‌ను ఏర్పాటు చేయడం వల్ల రైతులు మరియు నిరుద్యోగ యువతకు ప్రయోజనకరంగా ఉంటుందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమయ్యారని వారు ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని యావత్ గిరిజన సమాజం ఖండించాలని వారు కోరారు. రాజకీయాల ముసుగులో మన హక్కులను కాలరాస్తున్నారని, దీనిని ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని అన్నారు. మన్య ప్రాంతంలోని మేధావులు, నిరుద్యోగ యువత, రైతులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, మరియు అన్ని రాజకీయ పార్టీల పెద్దలు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.

Post a Comment

0 Comments